ఏసీలో మంటలు, పేలుళ్లకు కారణాలు: సింపుల్ మెయింటెనెన్స్
ఈ ఉదయం ఢిల్లీలో ఓ నాలుగంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీనికి కారణం ఏసీలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించారంటే ఏసీలో సంభవించే పేలుడు, అగ్నిప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తేలికపాటి మెయింటెనెన్స్ తో ఏసీలో సంభవించే పేలుళ్లను నివారించవచ్చు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కంప్రెషర్ వేడెక్కడం:
ఏసీ గుండెగా భావించే కంప్రెషర్, వేసవిలో ఎటువంటి విరామం లేకుండా నిరంతరంగా నడిపితే విపరీతంగా వేడెక్కవచ్చు. ధూళితో మూసుకుపోయిన కండెన్సర్ కాయిల్స్ దీని పనితీరును మరింత ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో అధిక వేడి ఏర్పడుతుంది. అది బయటికి వెళ్లడానికి సరైన మార్గం మూసుకుపోతుంది. ఫలితంగా కంప్రెషర్ పగిలిపోయే ప్రమాదం ఉంది.

షార్ట్ సర్క్యూట్:
నాసిరకం ఎక్స్‌టెన్షన్ కార్డ్‌లు లేదా సరిగా లేని సాకెట్‌లను ఉపయోగించడం వల్ల వైర్లు వేడెక్కడం, ఇన్సులేషన్ కరిగిపోవడం, స్పార్క్ రావడం జరుగుతుంటాయి. ఈ షార్ట్ సర్క్యూట్స్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ భాగాలు లేదా త్వరగా మండే స్వభావం గల రిఫ్రిజెరాంట్‌ను మండిస్తాయి. అగ్ని ప్రమాదానికి దారి తీస్తాయి.
కూలింగ్ లీకేజీలు:
ఆర్ 32 లేదా ఆర్ 290 వంటి మండే స్వభావం గల కూలింగ్ గ్యాస్ లీక్ కావడం అత్యంత ప్రమాదకరం. ఇది మైక్రో లెవెల్ స్పార్క్ ను కూడా సంగ్రహిస్తాయి. తక్షణ అగ్ని ప్రమాదాలు లేదా శక్తివంతమైన పేలుళ్లకు కారణమౌతాయి. ఈ లీకేజీలు గుర్తించడం కష్టం కాబట్టి మరింత జాగ్రత్త అవసరం.
హై కంప్రెషర్:
ఏసీ సర్వీసింగ్ సమయంలో గ్యాస్ అవసరానికి మించి నింపడం లేదా గాలి, తేమతో కలవడం వంటి సాంకేతిక కారణాల వల్ల సిస్టమ్ లోపల కంప్రెషర్ పెరుగుతుంది. దాని సేఫ్టీ లెవెల్ ను మించి పెరిగితే పైప్‌లు పగిలిపోతాయి. ఫలితంగా ఏసీ మిషన్ మంటలబారిన పడే ప్రమాదం ఉంది.
హెచ్చరిక సంకేతాలు:
ఏసీ నుండి ఏదైనా కాలిపోతున్న వాసన వస్తే వేడికి లోపలి వైర్లు కరిగిపోతున్నాయని అర్థం. గ్రైండింగ్, హిస్సింగ్ లేదా గడగడమంటూ వింత శబ్దాలు వస్తున్నా, సర్క్యూట్ బ్రేకర్ తరచుగా ట్రిప్ అవుతున్నా అది సర్విసింగ్ కు వచ్చినట్టే.
ఏసీ ఆన్ చేసినప్పుడు ఇంట్లో లైట్లు డిమ్ అయినా కూడా అది ప్రమాదం కిందికే లెక్క. అలాంటప్పుడు వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. దాన్ని రిపేరుకు ఇవ్వాలి.
ఏసీ ప్రమాదాలను నివారించడం ఎలా?
ఏసీలను నిరంతరాయంగా గంటల తరబడి నడపకూడదు. దానిపై ఒత్తిడిని తగ్గించాలి. దీనికోసం టైమర్ సెట్టింగ్‌లను ఉపయోగించాలి. ఏసీకి కొంత విరామం ఇవ్వడం అవసరం కూడా. దాన్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏసీ సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
ఏసీలను నేరుగా ప్రత్యేకమైన, అధిక సామర్థ్యం గల (16A) సాకెట్‌లోకి ప్లగ్ చేయాలి. ఎక్స్‌టెన్షన్ బోర్డులను అస్సలు ఉపయోగించవద్దు. బయటివైపు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎటువంటి అడ్డంకులు లేకుండా గాలి ప్రసరణకు వీలు కల్పించాలి.
అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయాలి?
ఒకవేళ ఏసీకి అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే మెయిన్ ఎంసీబీని ఉపయోగించి విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. ఇంట్లో నుండి వెంటనే బయటికి రావాలి. అగ్నిమాపక విభాగానికి కాల్ చేయాలి. మంటలపై ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని విసరకూడదు. ఎలక్ట్రిక్ మంటలను ఆర్పడానికి డ్రై కెమికల్ (ABC), అగ్నిమాపక యంత్రాన్ని లేదా ఇసుకను వాడాలి.












Click it and Unblock the Notifications