శ్రీహరి యోగనిద్రలో వెళ్లే పరమ పావన దినం: ప్రాముఖ్యతలు
ఈ నెల 6వ తేదీన దేవశయని ఏకాదశి. ఆషాడ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని దేవశయని ఏకాదశి జరుపుకొంటారు. ఆషాఢ ఏకాదశిగా, శయన ఏకాదశిగా పిలుస్తారు. హిందూ శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనిస్తాడని నమ్ముతారు. భాగవత పురాణాల ప్రకారం పాతాళ లోకంలో నిద్రిస్తాడని విశ్వసిస్తారు.
ఈ రోజు నుంచే శ్రీ విష్ణువు యోగనిద్రలోకి వెళతారు. చాతుర్మాసం ఆ రోజు నుంచే మొదలవుతుంది. ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. పంచాంగం ప్రకారం, ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి జూలై 5న సాయంత్రం 6:58 నిమిషాలకు ప్రారంభమై.. 6న రాత్రి 9:14 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, దేవశయని ఏకాదశి వ్రతాన్ని జూలై 6న ఆచరిస్తారు.

దేవశయని ఏకాదశి ప్రాముఖ్యత
ఈ రోజున విష్ణువు క్షీరసాగరంలో శయనిస్తాడు. ప్రబోధిని ఏకాదశి (కార్తీక శుక్ల ఏకాదశి) రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని దేవతల విశ్రాంతి కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, యజ్ఞాలు వంటి శుభ కార్యాలు చేయడం నిషేధం.
దేవశయని ఏకాదశి వ్రత కథ - 1
పురాణ కథల ప్రకారం, సత్యయుగంలో మాంధాత అనే రాజు ఉండేవాడు. అతను చాలా ధర్మనిష్ఠాగలవాడు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడేవాడు. ఒకసారి అతని రాజ్యంలో మూడు సంవత్సరాల పాటు వర్షాలు లేక కరువు ఏర్పడింది. ప్రజలు దుఃఖంతో, కష్టతరమైన జీవితాన్ని గడపసాగారు.
రాజు ఈ సమస్య నుండి విముక్తి పొందడానికి మహర్షి అంగీరసుని మార్గదర్శకత్వం కోరాడు. అప్పుడు మహర్షి ఆషాఢ శుక్ల ఏకాదశి వ్రతం చేస్తే, వర్షాలు కురుస్తాయి, కష్టాలు తొలగిపోతాయని సూచిస్తాడు. రాజు తన రాజ్యంలో ఈ వ్రతం గురించి ప్రకటన చేశాడు. ప్రజలంతా శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతం చేశారు. దీంతో ఆ రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి.
దేవశయని ఏకాదశి వ్రత కథ - 2
మరో కథ ప్రకారం, విష్ణువు బలి చక్రవర్తిని పాతాళ లోకానికి రాజుగా చేసినప్పుడు, బలి విష్ణువును ఒక వరం కోరుకున్నాడు. తాను పాతాళ లోకంలో ఆయనకు సేవ చేయాలని, కనుక ఆయన తనతో పాటే ఉండాలని కోరాడు. అప్పుడు విష్ణువు బలికి దేవశయని ఏకాదశి నుండి దేవ ప్రబోధిని ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు తాను అతనితో ఉంటానని వాగ్దానం చేశాడు.
విష్ణువు పాతాళ లోకానికి వెళ్లడాన్నే దేవశయనం అంటారు. విష్ణువు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం దేవశయని ఏకాదశి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఏకాదశి మనల్ని మన కర్మలపై, మన మాటపై కట్టుబడి ఉండేలా చేస్తుంది.
దేవశయని ఏకాదశి నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఇది కార్తీక శుక్ల ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ నాలుగు నెలల్లో సాధువులు, సన్యాసులు ఒకే చోట ఉండి తపస్సు, సాధన మరియు సత్సంగాలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ వ్రతం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని కూడా విశ్వసిస్తారు.












Click it and Unblock the Notifications