శ్రావణమాసంలో తిరుచానూరు ఆలయంలో ఆర్జిత సేవలు ఇలా.. !!
త్వరలో పవిత్ర శ్రావణమాసం ఆరంభం కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. తిరుమల, తిరుపతిల్లో ఉండే ఆలయాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా కనిపిస్తుంటుందీ మాసంలో. భక్తుల కోరికలను తీర్చే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పద్మావతీ అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత కలగాలని సంకల్పిస్తూ తిరుచానూరు ఆలయంలో నిత్యం ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం జరుగుతున్న ఈ సేవల్లో దేశ విదేశాల నుండి ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు. ఈ ఆలయంలో నిత్య, వారాంత, నెలవారీ, వార్షిక, శాశ్వత ఆర్జిత సేవలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు.

నిత్య సేవల్లో భాగంగా.. ప్రతిరోజూ తెల్లవారు జామున 4.30 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. శుక్రవారం మాత్రం 3.30 గంటలకే ఈ సేవ ఆరంభమౌతుంది. 5 గంటలకు సహస్రనామార్చన నిర్వహిస్తారు. శుక్రవారం నాడు 4 గంటలకు ఈ సేవ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు కుంకుమార్చన, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు సహస్ర దీపాలంకార సేవ ఉంటుంది.
ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. శుక్రవారం మాత్రం రాత్రి 9.45 గంటలకు ఈ సేవ ఉంటుంది. ఆలయంలోని వేదాశీర్వచన మండపంలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు వేదాశీర్వచనం కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది.
వారాంతపు సేవల్లో భాగంగా.. ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహిస్తారు. ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు తిరుప్పావడ, ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అనంతరం అభిషేక కార్యక్రమాన్ని జరుపుతారు అర్చకులు. ఉదయం 7 గంటలకు అభిషేకానంతర దర్శనం కల్పిస్తారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు లక్ష్మీపూజ ఉంటుంది. ప్రతి శనివారం ఉదయం 7.30 గంటలకు పుష్పాంజలి సేవ జరుగుతుంది.
ప్రతి నెలా మొదటి బుధవారం ఉదయం 7 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. అలాగే వార్షిక సేవలో భాగంగా ప్రతి ఏడాది మే లో వసంతోత్సవాలు, సెప్టెంబర్ నెలలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. నవంబర్ లో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ రోజున లక్ష కుంకుమార్చన, మరుసటి రోజు పుష్పయాగం వైభవంగా జరుగుతాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శాశ్వత సేవలలో భాగంగా నిత్య అర్చన, ఊంజల్ సేవలను భక్తులు కోరిన రోజున నిర్వహించి ఇద్దరికి దర్శన భాగ్యం కల్పిస్తారు అర్చకులు. ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevesthanams.ap.gov.in లో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా కూడా సేవా టికెట్లు పొందవచ్చు.




Click it and Unblock the Notifications