శ్రీదుర్ముఖి: ప్రభావాలు, ఫలితాలు ఏమిటి?

శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణామ్‌ |

ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచిత పంచాంగ మాకర్ణ్యతామ్‌ ||

అస్య శ్రీ సమస్త కల్యాణ భాజనస్య శ్రౌత స్మార్త నిత్యనైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన నిదాన భూతస్య స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరస్య సృష్ట్యాది గత

సౌరాబ్దాః 195,58,85,117
కల్యాది గతాబ్దాః 5117,
విక్రమార్క శకాబ్దాః 2073,
శాలివాహన శకాబ్దాః 1938,
క్రీస్తు శకాబ్దాః 2016 - 2017.

వ్యవహారమానేన -

అథాస్మిన్దేశే లోక వ్యవహారార్థం చాంద్రమానాబ్దో గ్రాహ్యః. వింధ్యస్యోత్తరదేశే బార్హస్పత్యమానాబ్దో గ్రాహ్యః. శేషాచలస్య దక్షిణ దేశే సౌరమానాబ్దో గ్రాహ్యః. చాంద్ర, సౌరమానవశాదయం దుర్ముఖ నామ సంవత్సర. బార్హస్పత్యమానవశాత్‌ సౌమ్య నామ సంవత్సరః. గురూదయ వశాత్‌ ఫాల్గునాబ్దః.
సంవత్సర ఫలితాంశములు

1. రాజా శుక్రః
2. మంత్రీ బుధః
3. సేనాధిపః కుజః
4. సస్యాధిపః శనిః
5. ధాన్యాధిపః గురుః
6. అర్ఘాధిపః కుజః
7. మేఘాధిపః కుజః
8. రసాధిపః చంధ్రః 9. నీరసాధిపః శనిః

Sri durmukhi nama samathsara Phalitahalu

వీరు సంవత్సర నాయకులు. మొదటి తొమ్మిది మంది ప్రధాన నాయకులు.
వీరిని బట్టి ఈ సంవత్సర కాలంలో భారతదేశంలోని ప్రజల మనోవృత్తుల గణనములు, శుభాశుభ విషయములో ఎట్లు ప్రవర్తించునో తెలియును. ఈ సంవత్సరము 9 మంది ప్రధాన నాయకులలో 4 శుభులు. 21 మంది ఉపనాయకులలో 10 మందికి శుభత్వం కలిగినది. కాగా ఈ సంవత్సరము లాభనష్టాలు రెండు కూడ తీవ్రస్థాయిలో కన్పిస్తున్నాయి.

- ప్రజలు, నాయకులు కూడ తీవ్రముగా ఆలోచిస్తారు. తీవ్రముగా ప్రయత్నిస్తారు. రాజ్యాధిపత్యం శుక్రుడికి,
మంత్రిత్వం బుధుడికి రావటం వల్ల అన్ని రంగాలలోను, ఆర్ధిక వ్యూహాలలోను పరస్పర పొంతనలతోను, సమగ్ర సమన్వయముతోను కూడిన ప్రణాళికలు వెలువడును.
-అంతర్జాతీయ స్నేహసంబంధాల వలన మన నాయకులు విదేశముల నుండి ఋణ ఆర్ధిక సహాయమును అధికముగా తీసుకొని రాగల సూచనలు ఉన్నాయి. కాని ఆ లాభములు ప్రజలను చేరులోపల అనేక రంధ్రములు ఏర్పడి కొన్ని చిక్కులు వచ్చును. అలాగే సమాజంలో అతివాద, తీవ్రవాద ధోరణులను పెరిగినప్పటికిని వాటి అణచివేత కూడ అంతే తీవ్రంగానే ఉండే సూచనలున్నాయి. అలాగే అంతర్గత రక్షణ వ్యవస్థలోను, సైనిక వ్యవస్థలోను కూడ చెప్పుకోదగ్గ విజయాలను సాధిస్తారు. కాగా, జాతీయంగాను, అంతర్జాతీయంగాను కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొనప్పటికిని నాయకులు, అధికారులు దృఢసంకల్పంతోనే వ్యవహరిస్తారు. ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు తీవ్రంగా లేచినప్పటికీ వాటి అణచివేత కూడ తీవ్రంగానే ఉండే సూచనలు ఉన్నాయి. ఇన్ని గందరగోళాల మధ్యలో కొన్ని దీర్ఘకాలిక శుభ పరిణామాలు కూడా ఆశాకిరణాలుగా కన్పిస్తున్నాయి.
-అంతర్జాతీయ సరిహద్దు తగాదాలలో మన దేశానికి కొన్ని నూతన విజయాలు అందవచ్చు. అంతర్‌ రాష్ట్రీయ జల వివాదాలలో కొంతవరకు సామరస్యమైన సర్దుపాటుదనము కనిపించవచ్చును. పరిశ్రమలు, భారీ పరిశ్రమలు ఈ ఏడు కూడ ముందడుగు వేస్తాయి.
- వ్యవసాయాభివృద్ధికి మధ్య మధ్య అవాంతరాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఋతుపవనాలు ఆలస్యమై వర్షాభావ పరిస్థితులు ఎదురు అవుతాయి. తుఫానులు పెరిగినప్పటికీ, పంటలకు పెద్దగా దెబ్బ తగలకపోవచ్చు. తద్ద్వారా మన విదేశీ వాణిజ్యం పెరిగే సూచనలు ఉండుట ఇత్యాది అంశములను పునాదిగా పెట్టుకొని వర్షలగ్న, జగల్లగ్నాలను విచారణ చేయగా-

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు - సుస్థిరంగా ఉన్నప్పటికినీ పాలకులకు, అధికారులకు అంతర్గతమైనటువంటి పరస్పర విభేదాలు, ఆదిపత్య ధోరణులతో ప్రజోపయోగ పథకాలు నత్తనడకగా సాగి ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. తరచు అకాల విపత్తులతో, ఊహించని ప్రమాదాలతో సామాన్య ప్రజానీకం ఇక్కట్లు పాలయ్యే సూచనలు ఉన్నాయి.
- ద్వితీయ స్థానమును పరిశీలించగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగు. కాని, వృధావ్యయము ఎక్కువయి ప్రజలకు సకాలంలో ఆర్ధిక ప్రయోజనాలు అందే విషయంలో అసంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో కొంత సామరస్య ధోరణులు పెరుగుతాయి. యాజమాన్య వైఫల్యాలతో బ్యాంకింగ్‌ రంగము కొంత కుదేలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

-తృతీయస్థానమును పరిశీలించగా రాష్ట్ర రవాణారంగము పలు ఆకర్షణీయ ప్రజోపయోగ పథకాలతో ప్రజల మన్ననలందుకుంటుంది. అలాగే పత్రికా, సమాచార రంగాలలో వినూత్నమైన విప్లవాత్మక సంస్కరణలతో కూడిన మార్పులు పెరిగినప్పటికిని ప్రతిభకు తగిన ప్రోత్సాహము మాత్రము కరువవుతుంది.

-చతుర్థస్థానమును పరిశీలించగా రియల్‌ ఎస్టేటు రంగాలలో కొంత వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికిని అభివృద్ధికరమైన పరిణామములు గోచరించుచున్నవి. వ్యవసాయ రంగములో ప్రకృతి బాధలు, ఈతిబాధలు పెరిగి పంటలు కొంత తగ్గటం, ప్రభుత్వపు ప్రోత్సాహం తక్కువగా ఉండటం, పరిశ్రమాధిపతుల దమన శాసనముల బలముచే రైతులకు గిట్టుబాటు ధర విషయమున గోటిచుట్టుపై రోకలిపోటు వలె కనిపించుచున్నది. విద్యారంగంలో కూడా విద్యార్థులు గుర్తింపులేని విజయాలను సాధించినప్పటికిని, వారికి అభివృద్ధి బాగానే ఉంటుంది.
-పంచమ స్థానమును పరిశీలించగా శిశుసంక్షేమం, సంగీత, సాహిత్య, పరిశోధనా రంగాలకు ప్రభుత్వ ప్రోత్సాహం గతంకంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.

-షష్ఠస్థానమును పరిశీలించగా అన్ని రంగాలలోను అనారోగ్య కరమైన పోటీ ఎక్కువ, నిజమైన అభివృద్ధి తక్కువగాను ఉంటుంది. రాష్ట్రంలో అంటువ్యాధులు బాగా ప్రబలి ప్రజలకు ఆరోగ్య విషయంలో ఆందోళన ఎక్కువ అవుతుంది. కాగా, ప్రజారక్షణ విషయంలో ప్రభుత్వం సమర్థవంతముగా వ్యవహరించి ప్రజల మన్నను చూడగొంటుంది.
- సప్తమ స్థానమును పరిశీలించగా రాష్ట్రం కేంద్రముతో సత్సంబంధాలు కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది. రాష్ట్ర వాణిజ్య వ్యవహారాలు కొంత అభివృద్ధి పథంలోనే కొనసాగుతాయి. విదేశములతో అనుకూల సంబంధములు పెరుగును. కాగా, రాష్ట్రంలో ఆదర్శ వివాహ వ్యవస్థలు కొంత బలహీనపడటం, ప్రేమ వివాహాలు పెరగటం, కుటుంబ విలువలకు ప్రాధాన్యత తగ్గడం, విడాకులు ఎక్కువగుట వంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

- అష్టమస్థానమును పరిశీలించగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనారోగ్య మూలకంగా మరణాలు పెరిగే అవకాశం ఉన్నది. అక్కడక్కడ కరువు కాటకాలు పెరుగుట, ఆర్థిక మోసాలు ఎక్కువ అవడం సామాన్యజన జీవనానికి విఘాతంగా పరిణమిస్తాయి.

-నవమ స్థానమును పరిశీలించగా మత సంబంధ విషయాలలో స్నేహపూర్వకమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సమాజంలో ఇటు ప్రజలలోను అటు పాలకులలోను ఆధ్యాత్మికత పెరిగి కొంత ధర్మానికి కట్టుబడి ఉండే లక్షణములున్నాయి. అక్కడక్కడ మత సంబంధ విషయాలలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తలను అదుపు చేయటంలో ప్రభుత్వం సఫలీకృతమవుతుంది.

-దశమ, ఏకాదశ స్థానములను పరిశీలించగా చట్ట విరుద్ధమైన పనులు జరుగుచున్నప్పటికిని, వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడంలో ప్రభుత్వము విఫలమవుతుంది. అలాగే వివిధ రంగాల ద్వారా రావలసిన ఆదాయం తగ్గు సూచనలు ఉన్నాయి. కాగా, చట్టపరమైన వ్యవహారాలు మాత్రము గత సంవత్సరము కంటే కొంతమేర వృద్ధి చెందుతాయి. కాగా, గ్రామీణ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ కృషికి తగిన ప్రతిఫలము లభిస్తుంది. -ద్వాదశ స్థానమును పరిశీలించగా గత ఏడాదివలె ఈ ఏడు కూడ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో ఆరోగ్యపథకములు వంటి ప్రజోపయోగ పనులకు తీవ్ర అంతరాయాలు, నష్టం ఏర్పడి సామాన్య జన జీవనానికి అవి అందని ద్రాక్షపళ్ళ వలె క్లిష్టం కావచ్చు. కాగా, ప్రభుత్వం అట్టి వారిని అదుపు చేయటంలో కొంతవరకే విజయం సాధిస్తుంది.

జగల్లగ్నమైన
జగల్లగ్నమైన తులను పరిశీలించగా గత సంవత్సరమునకు వలె కేంద్ర ప్రభుత్వ పాలకుల సమర్థత, ఆలోచనలు, వ్యవహారాలు, ఎంచుకున్న నిర్ధేశక సూత్రాలకు అనుగుణముగా, ప్రజోపయోగికరముగా ఉండి అంతర్జాతీయంగా మన దేశఖ్యాతి అతర్జాతీయముగా మరింత వృద్ధి చెందుతుంది.
ద్వితీయస్థానమును పరిశీలించగా దేశ ఆర్థిక సంస్కరణల విషయాలలో ప్రభుత్వము, నాయకులు పట్టుదలగా ఉన్నప్పటికిని వాటిలో గల లోపాలను సరిచేయడంలో వారు సమర్థులు కాలేరు. దేశ పురోగమనం, జాతీయ అభివృద్ధి, రాజకీయ సుస్థిరతకు భంగమును కలిగించ పోయినప్పటికిని ప్రశాంతత ఉండు సూచనలు తక్కువగా ఉన్నాయి.
-తృతీయస్థానమును పరిశీలించగా ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు బాగా వృద్ధి చెందినప్పటికి మన దేశానికి మేలు చేసే ఒప్పందాలు కుదుర్చు కొనడంలో అధికారులు విషలం అయ్యే సూచనలు ఉన్నాయి. విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, రాజకీయతీవ్రత వలన ఆశించిన సంస్కరణలు రాక పోవచ్చును. కాగా, కొన్ని ఆకస్మిక దుర్ఘటనలు జాతీయ రహదారుల అభివృద్ధికి ఆటంకముగా మారుతాయి.
-చతుర్థ స్థానమును పరిశీలించగా కేంద్రప్రభుత్వ నిరాదరణ ధోరణితో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు ఎండమావిగా కనిపిస్తున్నాయి. సమర్థులైన వైజ్ఞానికులు, వైద్యులు ఉన్నప్పటికిని ఆయా రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో తగిన కృషిని చేపట్టని పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగములో ప్రకృతి బాధలు, ఈతి బాధలు ఎక్కువవటం, ప్రభుత్వపు ప్రోత్సాహం తక్కువగా ఉండటం, ప్రభుత్వము వారి ఆర్థిక సహాయము కూడా కంటితుడుపు చర్యగా ఉండడం, ప్రభుత్వము వారి ఆర్ధిక సహాయము కూడా కంటితుడుపు చర్యగా ఉడటం రైతులకు తీవ్రనిరాశను కలిగిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు ఉన్నాయి.
-పంచమ స్థానమును పరిశీలించగా సంగీత, సాహిత్య, కళారంగాలలో మన దేశ కళాకారులకు, పరిశోధన సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం పెరగవచ్చును. అలాగే మన దేశ దౌత్యాధికారులు కూడా అంతర్జాతీయంగా దేశఖ్యాతిని ఇనుమడింప చేస్తారు.
-షష్ఠ స్థానమును పరిశీలించగా శత్రుదేశముల తాకిడియు, ఉగ్రవాదుల ధాటియు గుడ్డిలో మెల్లగా మెరుగుపడవచ్చును.

-సప్తమ స్థానమును పరిశీలించగా విదేశములతో అనుకూల సంబంధాలను వాణిజ్యపరంగాను, వ్యావహారిక పరంగాను వృద్ధి చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతముగా వ్యవహరించే సూచనలు ఉన్నాయి.
-అష్టమ స్థానమును పరిశీలించగా షేర్‌ మార్కెట్లు, స్పెక్యులేషన్‌ వ్యవహారాలు, ఆర్ధిక వ్యాపారాలలో తీవ్రమైన మాంద్యం కనిపిస్తున్నది.
-నవమ స్థానమును పరిశీలించగా దేశంలో ఆధ్యాత్మిక భావాలు, ప్రజలలో దేశభక్తి, జాతీయభావములు బాగా పెరుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక గురువులు నైతిక విలువలను, ఆధ్యాత్మిక విలువలను పెంచడంలో విపరీతమైన కృషి చేస్తారు. నౌకావ్యాపారములు మరింత అభివృద్ధి చెందుతాయి. అలాగే న్యాయశాఖలో జాతీయ ప్రాముఖ్యము గల విప్లవాత్మక తీర్పులు కొన్ని రావచ్చును. న్యాయవ్యవస్థ తన గౌరవమును నిలబెట్టుకొనుటకు అధికముగా శ్రమించవలసి వచ్చును.

-దశమస్థానమును పరిశీలించగా ఖాయిలా పడ్డ పరిశ్రమలు తిరిగి వెలుగు చూడవచ్చు. విశేషించి భారీ పరిశ్రమ రంగంలో కార్మిక యాజమాన్య వివాదాలు తమ హద్దులలో ఉండి ప్రగతికి దోహదం చేస్తాయి.
-ఏకాదశ, ద్వాదశ స్థానులను పరిశీలించగా దేశంలో నిరుద్యోగ తీవ్రత తగ్గును. ప్రభుత్వము వివిధ పథకముల ద్వారా సమృద్ధిగా ఆదాయ వనరులు సమీకరించు కొనును. రాజకీయ, సాంఘిక వత్తిడుల తీవ్రత ఎక్కువైనను, వారిని నియంత్రించే విషయంలో ప్రభుత్వం విజయం సాధిస్తుంది.

మొత్తం మీద ఈ సంవత్సరమున అన్ని ఇబ్బందులను ధైర్యంగా అధిగమించి, అభివృద్ధి పథములో పయనింప చేయుటలో ప్రభుత్వము సఫలీకృతమవుతుంది. ఈ సంవత్సరము మన దేశమును పాలించేగ్రహములలో సూర్యుని అంశ ఎక్కువున్నందున విశేషముగా సూర్యోపాసన అధికంగా చేసి ప్రగతిని, సన్మంగళములు పొందుదురు గాక !

శుభమ్‌ !!
శ్రీ దుర్ముఖ సంవత్సర దేవతా ధ్యానమ్‌
మరీచి దుర్ముఖాఖ్యానం మన్యుం మర్కట మాశ్రితమ్‌ |
వివృతాస్యం జగద్భీతిదాయకం సంశ్రయే ముదే ||

అబ్దత్రయఫలందుర్ముఖ నామ సంవత్సరమున రోగాదుల భయము, పైరులకు హాని, అనావృష్టి, దుర్భిక్షమును ఏర్పడును. అయినను ప్రజలు, ప్రభువులు నిత్యసంతుష్టులుగా ఉందురు. సంవత్సరమున అంతటా జలపూర్ణమై సర్వసస్య సమృద్ధి బాగా ఉంఉను. మిత్రులకు సరస్పరము ప్రీతి వృద్ధి చెందును. ధరల అందుబాటుతో అందరును సుకముగా ఉండురు. అధికారులకు పరస్పర వైరములు తగ్గును. విప్రులు యజ్ఞయాగాది క్రతుతత్పరులగుదురు.
దొంగల భయాలు ఎక్కువగును. స్త్రీలకు అపకారములు ఎక్కువగును. కొన్నిచోట్ల అతివృష్టి అధికముగా నుండును. కొన్ని చోట్ల ఈతులు అధికముగా నుండును. కొన్నిచోట్ల అందరకును సుఖముగాను ఉండును.

శుక్రుడు రాజగుటచే మంచి వర్షములు కురుయును. పంటలు సమృద్ధిగా పండును. పశువులు పుష్కలముగా పాలిచ్చును. దంపతులకు అన్యోన్యత పెరుగును.

బుధుడు మంత్రి అగుటచే మబ్బులు వాయువుచే ఎగరగొట్టబడి వర్షాలు తక్కువగా కురుస్తాయి. ప్రజలు పాపకర్మలు ఎక్కువగా చేస్తారు. పంటలు మధ్యమముగా పండుతాయి.

శని సస్యాధిపతిత్వముచే నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు పూర్తిగా ఫలించును. నల్ల నేల కూడా మంచి ఫలితములు ఇచ్చును.

ధాన్యాధిపతి గురువు అగుటచే అన్ని దేశములందును మంచి వానలుండి అన్ని పంటలు సమృద్ధిగా నుండును. పాడి కూడ చక్కగా నుండును.

కుజుడు అర్ఘాధిపతి అగుటచే మేఘములు వాయువుతో కూడి వర్షములు స్వల్పముగా ఉండును. అక్కడక్కడ వర్షములు కురియును. పంటలు, ఆరోగ్యములు సామాన్యముగా ఉండును.

మేఘాధిపుడు కుజుడు అగుటచే గాలి అధికమగును. వెలలు తగ్గును. వర్షము స్వల్పముగా కురుస్తుంది. ఎర్రని ధాన్యములు ఎక్కువగా ఫలించును.

చంద్రుడు రసాధిపతి అయితే నువ్వులు, నూనె, బెల్లం, తేనె, పెరుగు మొదలైన రస వస్తువుల ధరలు అధికము అవుతాయి. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు.

శని నీరసాధిపతి అయితే కొమ్ము, రాగి, మాంసం, చెక్క పాత్రలు, లోహపాత్రలు మొదలైన వాటికి అన్ని ప్రదేశాలలో ధరలు తక్కువగా ఉంటాయి.
పురోహితాదులు క్రూర గ్రహములయిన క్రూరఫలమును, శుభ గ్రహములయిన శుభఫలము నిత్తురు. గోపాలుడు పశునాయకుడగుటచే పశువృద్ధి, సుభిక్షము, సస్యసంపద, వెలలు వృద్ధి చెందును.4 కుంచముల వర్షము. సామాన్య వర్షముల్లో. సముద్రములలో 8, పర్వతములపై 9, భూమిపై 3 భాగములు వర్షించును. ''పద్మక'' నామక శ్శేషః. భూమిం వహతి, ''ప్రజానాం సుఖ మత్యన్త మారోగ్యం జాయతే ధ్రువమ్‌'' పద్మకుడు భూభారము వహించుచున్నందున ప్రజలు ఆరోగ్య సంపదులతో సంతోషముగా జీవించుదురు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+