వాస్తు ప్రకారం ఎప్పటికీ గిఫ్ట్ గా ఇవ్వకూడని వస్తువులు
ఇంట్లో శుభ కార్యక్రమం జరిగే వారికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. వాస్తు ప్రకారం.. కొన్ని రకాల బహుమతులను ఇవ్వకుండా ఉండటం మంచిది. ఇలాంటి వస్తువులను కానుకలుగా ఇవ్వడం వల్ల బంధాలు బలహీనపడతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవి కలహాలకు దారి తీయవచ్చు. అప్పటివరకు ఉన్న స్నేహ సంబంధాలు తిరోగమనం పట్టడానికే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధాలలో దూరం పెరుగుతుంది. ఒత్తిళ్లు తలెత్తుతాయి. ప్రతికూలతను పెంచుతాయని నమ్ముతారు. ఎవరికైనా బహుమతులు ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. వాస్తును అనుసరించి, ఎటువంటి వస్తువులను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదో కింద వివరంగా తెలుసుకుందాం.

కత్తులు, కత్తెరలు: వాస్తు శాస్త్రం ప్రకారం, కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం సంబంధాలను తెంచుకోవడాన్ని సూచిస్తుంది. ఇది వ్యక్తుల మధ్య విభేదాలకు, విరోధానికి, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందని నమ్ముతారు. సంతోషకరమైన సందర్భంలో ఇలాంటి వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు.
నలుపు రంగు వస్తువులు వద్దు: నలుపు రంగును ఆధునిక ప్రపంచం స్టైల్, అందానికి ప్రతీకగా చూస్తున్నప్పటికీ.. వాస్తు ప్రకారం నలుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. ఈ రంగు దుఖ్ఖానికి, దురదృష్టానికి సంకేతంగా భావించడం వల్ల అవి ఇవ్వకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం.
కృత్రిమ పువ్వులు: కృత్రిమ పువ్వులు స్థబ్దతకు, నిస్సారతకు ప్రతీకగా నమ్ముతారు. వీటిని బహుమతిగా ఇవ్వడం వల్ల ఇంట్లో జీవశక్తి లోపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. కాబట్టి, ఆత్మీయులకు పువ్వులను బహుమతిగా ఇవ్వాలనుకుంటే, సహజమైన, తాజా పువ్వులను మాత్రమే ఎంచుకోవాలి.
అక్వేరియం లేదా ఫౌంటెన్: వాస్తు శాస్త్రం ప్రకారం, నీటికి సంబంధించిన ఇంటి అలంకరణ వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ కర్మలను లేదా దురదృష్టాన్ని అవతలి వ్యక్తికి పంచుకున్నట్లు అవుతుందని విశ్వసిస్తారు. ఇది ఇంట్లో ఆర్థిక నష్టాలకు కూడా దారితీయవచ్చని కొందరు భావిస్తారు.
తోలు వస్తువులు: వాస్తు ప్రకారం, పర్సులు, హ్యాండ్ బ్యాగుల వంటి తోలు వస్తువులను బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఎందుకంటే అవి ప్రతికూల శక్తితో ముడిపడి ఉన్నాయని భావిస్తారు. ఇది ఇంటి వాతావరణంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, అశాంతిని కలిగిస్తుందని నమ్ముతారు.
గడియారం: ఇంట్లో కొత్తగా అడుగుపెట్టే వారికి గోడ గడియారం అనేది ఓ కామన్ గిఫ్ట్. వాస్తు ప్రకారం.. వాల్ క్లాక్ గానీ, రిస్ట్ వాచీలను గానీ ఎప్పటికీ ఇవ్వకూడదు. మన బంధాల గడువు తీరింది.. అనడానికి ఉదాహరణగా భావిస్తారని నమ్ముతారు. ఇది ఇంట్లోని వారికి ఒత్తిడిని, ప్రతికూల భావనలను కలిగిస్తుందని భావిస్తారు.
కర్చీఫ్: వాస్తు సంప్రదాయం ప్రకారం, హ్యాండ్ కర్చీఫ్ ను బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఇవి కన్నీళ్లు, దుఃఖాన్ని సూచిస్తాయని, తద్వారా సంబంధాలలో విచారం లేదా అపార్థాలను ఆహ్వానిస్తాయని నమ్ముతారు. అందువల్ల, వీటిని ఇవ్వడం మానుకోవాలి.
పచ్చళ్లు: పచ్చళ్లను బహుమతిగా ఇవ్వడం సంబంధాలలో చేదును కలిగిస్తుందని భావిస్తారు. ఒకవేళ మీరు పచ్చళ్ళను బహుమతిగా అందుకుంటే, వాటిని తిరిగి ఏదైనా తీపి వస్తువుతో బహుమతిగా ఇవ్వడం మంచిది. ఇది ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్మకం.
ముళ్ల మొక్కలు వద్దు: బతికున్న మొక్కలను బహుమతిగా ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను నివారించాలని సూచిస్తారు. ఇలాంటి మొక్కలు వివాదాలను ఆహ్వానించి, ఇంట్లో ఉద్రిక్తతను పెంచుతాయని నమ్ముతారు. సానుకూల శక్తినిచ్చే పూల మొక్కలను ఎంచుకోవడం ఉత్తమం.












Click it and Unblock the Notifications