మహబూబ్‌నగర్: మూడు ఏళ్లు కూడా నిండని పసికందు మూఢ నమ్మకాలకు బలై పోయాడు. గుప్తనిధులపై ఆశతో తల్లే తన కొడుకును బలి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్లే- చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో రెండున్నరేళ్ల వయస్సు గల శ్రీను ఆదివారం హత్యకు గురయ్యాడు. ఈ నెల 13వ తేదీ ఆదివారం ఆమావాస్య రోజు శ్రీనును గుప్తనిధుల కోసమే బలి ఇచ్చి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి తల, నడుము కింది భాగం మాత్రం అతడి అమ్మమ్మ ఇంట్లో పడి వున్నాయి. నడుము పైభాగం నుంచి రెండు చేతులతో సహా మొండెం వరకు కనిపించడం లేదు. కడుపులో అవయవాలన్నీ బయట పడ్డాయి. శవం భాగాలున్న చోట రక్తపు మరకలు లేవు. దీన్ని బట్టి హత్య వేరే చోట జరిగి వుండవచ్చునని భావిస్తున్నారు. గుప్తనిధుల కోసం వేటాడే మంత్రగాళ్లతో శ్రీను తల్లి భాగ్యమ్మ చేతులు కలిపినట్లు అనుమానిస్తున్నారు. భాగ్యమ్మకు జిల్లాలోని దేవరకద్ర మండలం డోకూర్‌కు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల కిందట పెళ్లయింది.
రెండున్నరేళ్ల క్రితం వారికి అబ్బాయి పుట్టాడు. మట్టి పని కోసం భార్యాభర్తలు గుజరాత్, రాజస్థాన్ వెళ్లారు. వారం రోజుల క్రితం భాగ్యమ్మ భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. డబ్బుకు ఆశపడి భాగ్యమ్మ మంత్రగాళ్లతో చేతులు కలిపిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పరారీలో వుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతుడి బంధువులందరూ వలస వెళ్లారు.