ఆర్మీ ఆయుధాల చోరీ మిస్టరీ వీడింది.. సంచలన విషయాలు బయటపెట్టిన డీజీపీ!
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు కొలిక్కి వచ్చాయని.. ఈ కేసును పోలీసులు ఛేదించారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెజిమెంట్‌లో పనిచేసిన హావల్దార్ మల్లేశ్ అలియాస్ రాజు చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసిందని డీజీపీ మీడియాకు తెలిపారు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లి గుంత తీసి పాతిపెట్టినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అసలేం జరిగిందో వివరించిన డీజీపీ సీవీ ఆనంద్
ఆగస్టు 31న మద్రాస్ రెజిమెంట్‌లోని బెల్ ఆర్మ్స్ లో ఆయుధాల చోరీ జరిగిందని.. పిస్టల్స్, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ చోరీ చేశారని డీజీపీ తెలిపారు. ఇంచార్జ్ వినోద్ కుమార్ నాయక్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుగా బెల్ ఆఫ్ ఆర్మ్స్ లోకి ఎవరెవరికి అనుమతి ఉందని విచారించినట్లు డీజీపీ వెల్లడించారు. ఆర్మ్స్ ఆఫ్ కోట్ ఇంఛార్జ్ వినోద్ కుమార్‌లతో పాటు ఆయుధగారం ఇంచార్జ్ బల్లి మధులను అనుమానితులుగా విచారించినట్లు చెప్పుకొచ్చారు. వారి దగ్గర నుండి చిన్న క్లూ కూడా దొరకలేదు. అనంతరం హావల్దార్లుగా పనిచేసిన ప్రకాశం జిల్లాకు చెందిన టీపీఎస్ రావు, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మల్లేశ్ అలియాస్ రాజును విచారించినట్లు డీజీపీ పేర్కొన్నారు.

ఈ క్రమంలో మల్లేశ్ వద్ద నుంచి అనుమానాస్పద కాల్ డేటా, డిలీట్ చేసిన వాట్సాప్ చాటింగ్స్ ను సాంకేతిక బృందాలు గుర్తించాయని.. విచారణలో మల్లేశ్ మొదట నిజాలను దాచేందుకు ప్రయత్నించినప్పటికీ.. తీవ్ర ఆందోళనకు గురవడాన్ని పోలీసులు గమనించారని డీజీపీ తెలిపారు. అనంతరం కేసు తీవ్రతను అతని భార్యకు వివరించడంతో.. ఆమె నిలదీయడంతో మల్లేశ్ నేరాన్ని అంగీకరించాడు.
చోరీ చేసిన ఆయుధాలను మల్లేశ్ తన స్వగ్రామానికి తరలించి అక్కడ గుంత తీసి పాతిపెట్టినట్లు విచారణలో వెల్లడించాడు. అతడు చూపించిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేసి ఆయుధాలు, బుల్లెట్లు, బైనాక్యులర్ ను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ముందు ఆగస్టు 28, 29, 30 తేదీల్లో సీసీ కెమెరాల నిఘా లేని ప్రాంతాలను గుర్తించి పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. అనంతరం ఆర్మీ నుంచి తనను తొలగించారన్న అసంతృప్తి, ఆగ్రహంతోనే ఈ చర్యకు ఒడిగట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశామని, చోరీ చేసిన ఆయుధాలను ఎవరకి ఇవ్వాలనుకున్నాడనే దానిపై తదుపరి విచారణ కొనసాగుతోందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.













Click it and Unblock the Notifications
