మోదీ- ట్రంప్ మధ్య ఫోన్ కాల్.. ఈ కీలక అంశాలపై చర్చలు..!
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు, మరోవైపు రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇరు దేశాల అధినేతలు భారత్- అమెరికా మధ్య డిఫెన్స్, ట్రేడ్, ఎనర్జీ అండ్ క్రిటికల్ టెక్నాలజీస్ తదితర రంగాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యలు, సవాళ్లపైనా చర్చించారు. ప్రపంచ శాంతికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఇరు దేశాల అధినేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇక ట్రంప్ తో ఫోన్ కాల్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ఇదే విషయాన్ని తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.
"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు విజయవంతంగా జరిగాయి. భారత్- అమెరికా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వాణిజ్యం, రక్షణ, ఇంధనం, క్రిటికల్ టెక్నాలజీతో ఇతర రంగాలపై రివ్యూ చేశాం. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక, సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కలిసి పనిచేయాలని నిర్ణయించాం. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపైనా చర్చలు జరిపాం. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు ముందుకు వేశాం" అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అటు ట్రంప్- మోదీ ఫోన్ సంభాషణపై భారత ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, డిఫెన్స్ కోఆపరేషన్, డెవలపింగ్ టెక్నాలజీపై సమీక్ష జరిపినట్లు తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య నిరంతరం సంప్రదింపుల్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం మాట్లాడుతూ.. భారత్ కు టెర్రరిజం అతిపెద్ద ఆందోళన సమస్యగా మారిందన్నారు. సరిహద్దు దేశాల నుంచి పెరుగుతున్న ఉగ్రవాదంపై తమ భాగస్వామ్య దేశాలు ఎలా అర్థం చేసుకుంటాయన్నదానిపైనే భారత సంబంధాలు ఆయా దేశాలపై ఆధారపడి ఉంటాయని అన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా- పాకిస్థాన్ మధ్య సంబంధాలు పెరిగిన నేపథ్యంలో జై శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications
