హైదరాబాద్‌లో ఉద్రిక్తత: గాలిలోకి కాల్పులు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి గుజరాత్ పోలీసుల కాల్పుల్లో మరణించిన యువకుడి శవయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఎనిమిది రౌండ్లు బాష్ప వాయువు ప్రయోగించారు.
గుజరాత్ మాజీ హోం మంత్రి హిరేన్ పాండ్యా హత్య కేసులో ముస్లిం మతనాయకుడు నసిరుద్దీన్‌ను తీసుకుపోవడానికి గుజరాత్ పోలీసులు వచ్చిన సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుజరాత్ పోలీసులను అడ్డుకోవడానికి నసీరుద్దీన్ అనుచరులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముజాహిద్ అనే యువకుడు మరణించాడు. ముజాహిద్ శవానికి సోమవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. ఆనంతరం శవయాత్ర ప్రారంభమైంది. ఈ శవయాత్ర సందర్భంగా సైదాబాద్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు ఆదివారం రాత్రి ముజాహిద్ శవాన్ని యశోదా ఆస్పత్రి నుంచి తరలించకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. నసీరుద్దీన్‌ను తమకు అప్పగిస్తే తప్ప శవాన్ని కదలనివ్వమని పట్టుబట్టారు. ముజాహిద్ కుటుంబ సభ్యులు అంగీకరించడంతో శవాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఆందోళనకారులు చేసిన దాడిలో ఇద్దరు ముగ్గురు పోలీసుల తలలకు గాయాలయ్యాయి. ఒక ప్రైవేట్ టీవీ చానల్ వాహనంపై కూడా దాడి చేశారు. ఆందోళనకారులు నాలుగు ఫోర్ వీలర్స్‌ను, ఎనిమిది టూ వీలర్స్‌ను ధ్వంసం చేశారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు.











Click it and Unblock the Notifications