ఖమేనీ మృతదేహం 4 నెలలుగా ఎక్కడుంది ? ఇస్లామిక్ సంప్రదాయం ఉల్లంఘన మధ్య..!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ (Ayatollah Khamenei)కి నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం సాధారణంగా మరణించిన వెంటనే అంత్యక్రియలు జరగాలి. అయితే ఇప్పటివరకూ ఇరాన్ ఎదుర్కొంటున్న అసాధారణ యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియలో అనూహ్యమైన ఆలస్యం జరిగింది. తాజాగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో యుద్దం ఆగడం వల్ల ఖమేనీ అంత్యక్రియలకు రంగం సిద్దమవుతోంది.
ఖమేనీ మృతదేహం ఎక్కడ ? (Ayatollah Khamenei)
ఈ నేపథ్యంలో అసలు ఈ నాలుగు నెలల పాటు ఖమేనీ మృతదేహం ఎక్కడుంది ? యుద్దంలో ఎవరి కంట పడకుండా అత్యంత జాగ్రత్తగా ఆ భౌతిక కాయాన్ని ఇరాన్ ఎలా భద్రపరిచిందన్న చర్చ జరుగుతోంది. ఖమేనీ భౌతికకాయాన్ని తాత్కాలికంగా పూడ్చిపెట్టారనే ఊహాగానాలను ఇరాన్ అధికారులు ఇప్పటికే ఖండించారు. తీవ్రమైన యుద్ధ వాతావరణం వల్లే అంత్యక్రియలు ఆలస్యమయ్యాయని వారు స్పష్టం చేశారు. మతపరమైన నిబంధనలకు లోబడే ఆయన పార్థివ దేహాన్ని అత్యంత భద్రంగా ఉంచినట్లు తెలిపారు.

మతపరమైన నిబంధనలు మరియు భద్రత
సాధారణంగా ఇస్లాం మతంలో రసాయనాలను ఉపయోగించి శవాన్ని నిల్వ చేయడం (ఎంబాల్మింగ్) నిషిద్ధంగా భావిస్తారు. కాబట్టి శీతలీకరణ వ్యవస్థల ద్వారానే ఖమేనీ దేహాన్ని భద్రపరిచి ఉంటారని ఉగ్రవాద నిరోధక నిపుణుడు డాక్టర్ మహ్మద్ ఒమర్ విశ్లేషించారు. ఇరాన్ శవపరీక్షల విభాగాల్లో ఇలాంటి పద్ధతులు సాధారణమేనని ఆయన తెలిపారు. అసాధారణ విపత్కర పరిస్థితుల్లో షియా చట్టాల ప్రకారం అంత్యక్రియలను వాయిదా వేసేందుకు సులభంగానే మతాధికారుల నుంచి మినహాయింపులు లభిస్తాయని ఆయన వివరించారు.

ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్
ఈ అంత్యక్రియలను ప్రజలలో జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు ఒక అవకాశంగా ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఖమేనీ పిడికిలి బిగించిన చిత్రంతో కూడిన చిహ్నాన్ని, "మనం మేల్కొనాలి" అనే నినాదాన్ని అధికారిక బృందం ప్రచారంలోకి తెచ్చింది. అయినప్పటికీ, రాజధాని టెహ్రాన్ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలతో నిశ్శబ్దంగా ఉంది. గతంలో దేశ విప్లవ పితామహుడు అయాతొల్లా రుహొల్లా ఖొమేనీ మరణించిన సమయంలో జరిగిన ఉద్వేగభరిత శవయాత్రతో పోలిస్తే ఇప్పటి వాతావరణం భిన్నంగా ఉంది.














Click it and Unblock the Notifications