పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ రికార్డ్.. దేశంలోనే రెండవ స్థానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోకి వస్తున్న కొత్త పారిశ్రామిక పెట్టుబడులను సాధించడంలో రాష్ట్రం గతంలో 9వ స్థానంలో ఉంటే, ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకుంది. పెట్టుబడుల ఆకర్షణలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఈ వేగవంతమైన పురోగతిని సాధించింది.
పెట్టుబడుల ఆకర్షణలో రెండవ స్థానంలో ఏపీ
2023-24 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో 9వ స్థానంలో ఉన్న ఏపీ, 2024 లో 5వ స్థానానికి, 2025-26 సంవత్సరానికి రెండో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకున్న సంస్కరణలు, రాష్ట్రంలో వ్యాపారానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించడం, పారదర్శకమైన సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ కారణంగా ఈ విజయం సాధ్యమైంది.

జాతీయస్థాయిలో పారిశ్రామిక వృద్ధి, వ్యాపార అనుకూల వాతావరణంపై విడుదలైన గణాంకాలు
పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, వారికి కావలసినటువంటి ఫెసిలిటీస్ కల్పించడం వంటి చర్యలతో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. జాతీయ స్థాయిలో పారిశ్రామిక వృద్ధి, వ్యాపార అనుకూల వాతావరణంపై విడుదలైన తాజా గణాంకాలు ప్రకారం టాప్ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచాయి.
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర
గుజరాత్ 4వ, ఒడిశా 5వ, కర్ణాటక 6వ, మధ్యప్రదేశ్ 7వ, తెలంగాణ 8వ, ఉత్తరప్రదేశ్ 9వ, తమిళనాడు 10వ స్థానాల్లో ఉన్నాయి. పారిశ్రామికంగా బలమైన గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలను కూడా వెనక్కి నెట్టి ఏపీ ముందంజ వేయడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని సూచిస్తుంది. కేవలం భారీ పరిశ్రమలు, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోనే కాకుండా సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర సృష్టిస్తోంది.
అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేస్తున్న టాప్-10 రాష్ట్రాలలో చోటు
గతంలో ఐటీ రంగం పెద్దగా విస్తరించని పరిస్థితి నుంచి బయటపడి, దేశంలో అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేస్తున్న టాప్-10 రాష్ట్రాల జాబితాలో మొదటిసారిగా చోటు సంపాదించింది. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు , స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల టెక్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ఈ పెట్టుబడుల వాతావరణం మెరుగుపడటంతో అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి.
నిరుద్యోగ యువతకు నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
దీనివల్ల రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. స్థానికంగానే ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన లక్షలాది మంది నిరుద్యోగ యువతకు నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.












Click it and Unblock the Notifications