అయోధ్య విరాళాల చోరీపై నోరువిప్పిన ఆరెస్సెస్..! సంచలన వ్యాఖ్యలు..1
యూపీలోని అయోధ్యలో రెండేళ్ల క్రితం నిర్మించిన అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir)లో కోట్ల రూపాయల విరాళాల్ని ఇంటి దొంగలే కొట్టేసిన అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై కొన్ని రోజులుగా సిట్ దర్యాప్తు చేస్తున్న అంశాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నా..నోరు విప్పని ఆరెస్సెస్ (RSS) ఇవాళ ఎట్టకేలకు స్పందించింది. అయోధ్యలో చోరీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హోసబెలే వ్యాఖ్యానించారు.
అయోధ్యలోని శ్రీరామ లల్లా ఆలయంలోని విరాళాల పెట్టెల నుండి సొమ్మును అపహరించిన దురదృష్టకర ఘటన, యావత్ సమాజం, రామ భక్తుల మనోభావాలను, శ్రద్ధాభక్తులను గాయపరిచిందని, తమ అందరినీ బాధించిందని దత్తాత్రేయ తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు యూపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన చర్యలను ప్రారంభించిందన్నారు. ఈ దర్యాప్తులో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్ష పడేలా చూడటం అత్యవసరమని తెలిపారు.

ఈ ఘటనను ఒక ప్రత్యేకమైన, తీవ్రమైన అంశంగా పరిగణించాలని, అలాగే ఏర్పాట్లు, నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి అత్యంత చిత్తశుద్ధితో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ నుంచి సహజంగానే ఆరెస్సెస్, యావత్ హిందూ సమాజం ఆశిస్తాయన్నారు. తద్వారా అయోధ్య ఆలయం పట్ల కోట్లాది మంది రామ భక్తులకు ఉన్న విశ్వాసం, భక్తిభావం చెక్కుచెదరకుండా, స్థిరంగా కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం, అనిశ్చితికి ముగింపు పలకాలని, అందుకే ఆలయ యాజమాన్యం , ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు.

సరైన ఆర్థిక నిర్వహణ, పారదర్శకమైన వ్యవస్థలతో కూడిన సజావుైన కార్యకలాపాలు, పవిత్రత, భక్తిభావం నిండిన వాతావరణం ద్వారా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ సమాజం యొక్క విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఈ క్లిష్ట సమయంలో అవసరమైన సహనం, సంయమనాన్ని పాటించాలని, అలాగే ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకుని హిందూ ధర్మాన్ని, సమాజాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్న హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యావత్ హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.















Click it and Unblock the Notifications