Golconda Traffic: గోల్కొండ కోట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలు ఇవే..!
భారత 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్ లో ఘనంగా జరగనున్నాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ వేడుకను తిలకించేందుకు భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో పలు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ జోయల్ డేవిస్ వెల్లడించారు.
ట్రాఫిక్ నిబంధనలు, దారుల మళ్లింపు వివరాలు..
సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. రామదేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే రహదారిని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ వాహనాల కోసం పూర్తిగా మూసివేయనున్నారు. గోల్డ్, క్రీమ్, బ్లూ కార్ పాస్ లు కలిగిన ఆహ్వానితులు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు రామదేవ్ గూడ మార్గం ద్వారా కోట వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్, బాలికా భవన్, లంగర్ హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రామదేవ్‌గూడ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకుని మక్కై దర్వాజా ద్వారా గోల్కొండ కోట గేట్ వద్దకు చేరుకోవాలి. వీళ్లు కోట ప్రధాన గేట్ ఎదురుగా ఉన్న ఫతే దర్వాజా రోడ్డులో వాహనాలు పార్క్ చేయాలి. అలాగే ప్రధాన గేట్‌కు 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్కింగ్ చేయాలి.
సెవెన్ టాంబ్స్, బంజారా దర్వాజా వైపు నుండి వచ్చే వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎడమ మలుపు తీసుకుని ఒవైసీ గ్రౌండ్ కు చేరుకోవాలి. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ వైపు నుండి వచ్చే వారు ఫతే దర్వాజా, బడా బజార్ వద్ద కుడి మలుపు తీసుకుని GHMC ఐలాండ్ మీదుగా వెళ్లి ఒవైసీ / GHMC ప్లే గ్రౌండ్లో వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక షేక్ పేట్ నాలా, టోలీచౌకి, సెవెన్ టాంబ్స్, బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ ఏరియా ఆసుపత్రికి చేరుకుని, ఆసుపత్రి ప్రాంగణంలోనే వాహనాలు పార్క్ చేయాలి.
అలాగే లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కింద యు-టర్న్ తీసుకుని, ఫతే దర్వాజా వైపు వెళ్లే తవక్కల్ డైవర్షన్ పాయింట్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పార్కింగ్ చేయాలి. షేక్ పేట్, టోలీచౌకి వైపు నుండి వచ్చే సాధారణ ప్రజలు సెవెన్ టాంబ్స్, డెక్కన్ పార్క్, లేదా గోల్కొండ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్లో వాహనాలు పార్క్ చేసుకునే అవకాశం ఉంది.

వేడుకలు ముగిసిన అనంతరం వాహనాల రాకపోకలు సులభతరం చేయడానికి, సెవెన్ టాంబ్స్ నుండి గోల్కొండ వైపు వచ్చే సాధారణ ప్రజలను గోల్ఫ్ క్లబ్, జమా ఎకాడమిక్ /జామాలి దర్వాజా వద్ద మళ్లిస్తారు. అలాగే లంగర్ హౌస్ నుండి వచ్చే వారిని బడా బజార్ జంక్షన్ వద్ద GHMC ఐలాండ్ వైపునకు మళ్లిస్తారు. ఇక ప్రయాణంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications