Droupadi Murmu : పాక్ అనుభవించాల్సిందే- సింధు జలాలకు బ్రేక్ పై తేల్చేసిన రాష్ట్రపతి..!
తీవ్రవాదులు తమ చర్యలకు తగిన ఫలితాలు అనుభవించాల్సిందేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu ) ఇవాళ మరోసారి తేల్చిచెప్పారు. పహల్గాం దాడుల తర్వాత సింధు జలాలకు బ్రేక్ వేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్దించారు. స్వాతంత్ర దినోత్సవం (Independence Day 2026) సందర్భంగా జాతినుద్దేశించి చేసే సంప్రదాయ ప్రసంగంలో ముర్ము పలు కీలక విషయాలు ప్రస్తావించారు. నక్సలిజం నిర్మూలన దిశగా భారత్ అడుగులు వేస్తోందని, అలాగే ప్రపంచమంతా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా భారత్ మాత్రం నిలకడగా వృద్ధి చెందుతోందని ఆమె కితాబిచ్చారు. అలాగే డబ్బుల్లేక ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని ఆమె ఆకాంక్షించారు.
ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు రాష్ట్రపతి గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో (పాకిస్తాన్ )సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాత్మక చర్యగా ముర్ము అభివర్ణించారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారు ఎక్కడ దాక్కున్నా పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని రాష్ట్రపతి హెచ్చరించారు. ఉగ్రవాదంపై భారత్ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని, ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కచ్చితమైన దాడులు నిర్వహించే సామర్థ్యం భారత సైన్యానికి ఉందని ఈ ఆపరేషన్ నిరూపించిందని ఆమె తెలిపారు.

భారత్‌ను నక్సలిజం రహిత దేశంగా మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న బస్తర్ ప్రాంతంలో అభివృద్ధి వేగం పుంజుకోవడంతో పాటు సాంస్కృతిక కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయన్నారు. మరోవైపు ప్రపంచం యుద్ధాలు, అస్థిరత, అనిశ్చితితో సతమతం అవుతుంటే. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రపంచ సగటు వృద్ధి రేటు కంటే రెండింతలకు పైగా వృద్ధి సాధిస్తోందన్నారు. గత దశాబ్దంలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని గుర్తుచేశారు. అలాగే ఉచిత రేషన్ పథకం ద్వారా 80 కోట్లకు పైగా ప్రజలకు ఆహార భద్రత లభిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కాకుండా చూడటం న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.














Click it and Unblock the Notifications