హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా - కష్టాలకు చెక్, ఇక నుంచి కొత్తగా..!!
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. పీక్ అవర్స్‌లో కిలోమీటరు ప్రయాణించేందుకు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఒక్కోసారి గంట సమయం పడుతోంది. ఇక వర్షం పడితే ఆ సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో.. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కొత్త ఆలోచన చేసారు. అమలుకు సిద్దం అయ్యారు.
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కొత్త కార్యాచరణ సిద్దం అవుతోంది. రద్దీ వేళల్లో సాఫీగా ప్రయాణాలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ, ఐటీ కంపెనీల బస్సులకు ఎలాంటి అడ్డంకీ లేకుండా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మార్గంలో టీజీఎస్ఆర్టీసీ, ఐటీ కంపెనీల బస్సులకు ప్రత్యేక లేన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తూ బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. రహదారి సామర్థ్యం, ట్రాఫిక్ ప్రవాహం, ప్రత్యేక బస్ లేన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ట్రయల్ రన్‌లో కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంతో పాటు జేఎన్‌టీయూ-బయోడైవర్సిటీ కారిడార్‌లో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రాకపోకలను పరిశీలన చేసిన అధికారులు ప్రత్యేక బస్ లేన్ ఏర్పాటు వల్ల సాధారణ వాహనాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశం పైన వివరాలు సేకరిస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో అధ్యయనం
అదే విధంగా ప్రతిపాదిస్తున్న విధంగా ఈ లేన్ ఏ ప్రాంతాల్లో అమలు సాధ్యం అవుతుందనేది క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. కాగా, ఎక్కడ మలుపులు, జంక్షన్లు, విలీన మార్గాలు సమస్యగా మారే అవకాశం ఉంది? వంటి అంశాలను కూడా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. పరిశీలనలను విశ్లేషించిన అనంతరం ప్రత్యేక బస్‌లేన్ ఏర్పాటుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు నుంచి వేవ్‌రాక్ దాకా 12.8 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రూట్లోనే స్పెషల్ లేన్‌ను సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న రహదారిలోనే ఒక లేన్‌ను ఆర్టీసీ, ఐటీ సంస్థల బస్సులు వెళ్లేందుకు వీలుగా కేటాయిస్తారు. స్పెషల్ లేన్‌లో వెళ్లే బస్సులు రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా, స్టాప్‌లు కూడా తక్కువ సంఖ్యలో ఉండేవిధంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తక్కువ సమయంలోనే ఐటీ ఉద్యోగులు గమ్య స్థానాల కు చేరుకునే అవకాశం కలుగుతుంది.













Click it and Unblock the Notifications
