అసెంబ్లీలో నాగం, అరుణల మధ్య వాగ్వివాదం
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్య ఉదంతంపై సోమవారం శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డికి, సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు డి.కె. అరుణకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు తెలుగుదేశం పార్టీ నాయకుల బంధువు అని, అందుకే గొడవ చేస్తున్నారని డి.కె. అరుణ అన్నారు.
అరుణ మాటలకు నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. పంటలు ఎండిపోయి దిక్కుతోచక రైతు ఆత్మహత్య చేసుకుంటే వ్యసనం వల్ల మరణించాడని అనడం సిగ్గు చేటు అని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. అరుణ తన మాటలు అబద్ధమైతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ చేశారు. రైతుల గురించి ఈ విధమైన మాటలకు సిగ్గుపడాలని ఆయన అన్నారు. కరెంట్ కోత వల్ల రాష్ట్రమంతటా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన అన్నారు. కరెంట్ సరఫరా సరిగా లేనందువల్ల చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications