వివాదాస్పద వ్యాఖ్యల ఉపసంహరణ: తస్లీమా
కోల్ కత్తా: వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్ తన ఆత్మకథనాత్మక నవల ద్విఖండిత నుంచి వివాదాస్పదమైన కొన్ని పంక్తులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. భారతదేశంలోని కొన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా వాటిని ఉపసంహరించుకున్నట్లు ఆమె శుక్రవారం పిటిఐ వార్తా సంస్థ ప్రతినిధితో ఫోనులో చెప్పారు. ద్విఖండిత రెండో భాగం రాయబోనని ఆమె చెప్పారు.
బంగ్లాదేశ్ లో 1980లో మిలటరీ సెక్యులరిజాన్ని పడగొట్టిన జ్ఞాపకాలను 2002లో ద్విఖండిత పేరుతో నవలగా రాశానని, దానిలో వివాదాస్పద పంక్తులను ఉపసంహరించుకుంటున్నానని, లౌకిక విలువల కోసం నిలబడిన వ్యక్తులకు మద్దతుగా తాను ఆ నవల రాశానని, ఎవరి సెంటిమెంటును కూడా దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదని ఆమె వివరించారు. తాను ఎక్కడున్నది ఆమె చెప్పలేదు. తాను కొన్ని పంక్తులను ఉపసంహరించుకుంటున్నందున ఇక వివాదమేదీ ఉండదని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను ఈ దేశంలో ప్రశాంతంగా ఉండగలనని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
పుస్తకం ప్రతులను పంపిణీ చేయకూడదని పీపుల్స్ బుక్ సొసైటీకి తాను ఇది వరకే సూచించానని ఆమె చెప్పారు. వివాదాస్పద పంక్తులను తొలగించి తరువాతి ఎడిషన్ ను ప్రచురించాలని ప్రచురణకర్తకు సూచించినట్లు కూడా ఆమె తెలిపారు. పుస్తకం ప్రతులను పంపిణీ చేయకూడదని తస్లీమా తమకు సూచించినట్లు ప్రచురణసంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. తాము 30, 40 పంక్తులను తొలగించి తర్వాతి ఎడిషన్ ను ప్రచురిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
