తెలంగాణ కొలిక్కి వస్తుంది: డిఎస్
న్యూఢిల్లీ: తెలంగాణ ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నూతన అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా శ్రీనివాస్ ను నియమించినట్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో భేటీలో చెప్పారు. తమ కాంగ్రెస్ సీనియర్లతో సమావేశమై ఉప ఎన్నికలపై వ్యూహాన్ని ఖరారు చేసుకుంటామని శ్రీనివాస్ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముందు సీనియర్లతో మాట్లాడాల్సి ఉందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో కలిసి సమన్వయంతో పని చేస్తానని ఆయన చెప్పారు. తగిన సమయంలో పిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపడుతానని ఆయన చెప్పారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తన నియామకం గురించి తెలియగానే ఆయన మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తమది విన్నింగ్ కాంబినేషన్ అని ముఖ్యమంత్రి అన్నారు.