వామపక్షాల మధ్య చిరు చిచ్చు
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బిజెపిపై చేసిన ప్రకటన ఉభయ కమ్యూనిస్టుల మధ్య చిచ్చు పెట్టింది. బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చిరంజీవి చేసిన ప్రకటనకు సిపిఐ సంతృప్తి చెందగా మరింత స్పష్టత కావాలని సిపిఎం అంటోంది. బిజెపిపై చిరంజీవి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. బిజెపిపై చిరంజీవి చేసిన ప్రకటనలో స్పష్టత లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలని సిపిఐ ఆలోచన చేస్తుండగా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది.
తాము రాష్ట్రంలో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే నడుస్తాయని ఆయన చెప్పారు. ఈ నెల 20,21 తేదీల్లో సిపిఐ, సిపిఎం పొత్తులపై చర్చలు జరుపుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడించే రీతిలో ప్రతిపక్షాల ఐక్యత ఉండాలని తాము కోరుకుంటున్నట్లు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రూపొందాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications