తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: తొలి విడత ఏప్రిల్ 16వ తేదీన పోలింగ్ జరిగే లోకసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రపతి ప్రతభా పాటిల్ సోమవారం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఐదు దశల్లో దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి విడత ఏప్రిల్ 16వ తేదీన 17 రాష్ట్ర్లాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 124 లోకసభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. అదే సమయంలో తొలి విడత 16వ తేదీన పోలింగ్ జరిగే ఆంధ్రప్రదేశ్ లోని 70 శాసనసభా నియోజక వర్గాలకు, ఒరిస్సాలోని 147 శాసనసభా స్థానాలకు సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు.
నోటిఫికేషన్ విడుదలతో 124 లోకసభ స్థానాల్లో నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. నామినేషన్ల పర్వం మార్చి 30వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో దశ ఎన్నికలు జరిగే 141 లోకసభ స్థానాలకు నోటిఫికేషన్ మార్చి 28వ తేదీన, మూడో దశ ఎన్నికలు జరిగే 107 స్థానాలకు ఏప్రిల్ 2వ తేదీన, నాలుగవ దశ ఎన్నికలు జరిగే 85 స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన, ఐదవ దశ ఎన్నికలు జరిగే 86 సీట్లకు ఏప్రిల్ 17వ తేదీన నోటిఫికేషన్లు జారీ అవుతాయి.












Click it and Unblock the Notifications