టిడిపికి సిపిఎం అల్టిమేటం
హైదరాబాద్: సీట్ల సర్దుబాటుపై సిపిఎం తెలుగుదేశం పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. తమకు బలం ఉన్న అన్ని స్థానాల్లో తాము పోటీ చేసి తీరుతామని సిపిఎం నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటుపై తలెత్తిన సమస్యపై చర్చించడానికి ఆదివారంనాడు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. వైరా, మంగళగిరి, పటాన్ చెరు, వరంగల్ (తూర్పు) శాసనసభా స్థానాలు తమకు ఇవ్వాల్సిందేనని సిపిఎం నాయకులు పట్టుబడుతున్నారు. ఈ స్థానాల్లో తాము నామినేషన్లు వేస్తామని, తెలుగుదేశం చొరవ చూపి సర్దుబాటు చేయకపోతే తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని సిపిఎం నాయకుడు వెంకటేశ్వరరావు అన్నారు.
సీట్ల సర్దుబాటులో గందరగోళానికి తెలుగుదేశం పార్టీయే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఇదిలా వుంటే, సిపిఎం నాయకులను బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రాయబారం నెరుపుతున్నారు. 15 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లతో సర్దుకోవాలని ఆయన సిపిఎం నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications