లక్నో: తనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి హెచ్చరించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...రీటా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రీటా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చినవేనని, దీనిపై ఆ పార్టీ అధినేత్రి సోనియా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన తర్వాత సోనియా మౌనంగా ఉండడం సిగ్గుచేటని, రీటా వ్యాఖ్యలను సోనియా ఖండించాలని అన్నారు. గతంలో తాను రాసిన పుస్తకంలో గాంధీ కుటుంబంపై రీటా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఈ సందర్భంగా మాయావతి గుర్తు చేశారు. బిఎస్పీ క్రమశిక్షణ గల పార్టీ అని, కలత చెందిన కార్యకర్తలు ఎలాంటి దుశ్చర్యలు చేయకుండా చూసుకుంటామని చెప్పారు.