నష్టాల్లో టీజీఎస్ఆర్టీసీ.. గత రెండునెలల్లో ఎన్ని కోట్ల నష్టమో తెలుసా.. కారణాలివే!
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ లాభాల బాటలో నడిచేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా, ఆర్టీసీ ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తుండగా, లాజిస్టిక్ సేవలతోనూ ఆర్టీసీ ఆదాయ సముపార్జనపైన దృష్టిపెట్టింది. ఈ విధంగా ఆర్టీసీ ఇటీవల కాలంలో లాభాల బాటలో ప్రయాణం చేస్తుంది అని అందరూ భావిస్తున్న సమయంలో, గత రెండు నెలలుగా ఆర్టీసీ నష్టాలను చూస్తుందని tgsrtc ఎండి నాగిరెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు.
వరంగల్ రీజియన్ పరిధిలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం
తెలంగాణ ఆర్టీసీ గత రెండు నెలలుగా నష్టాలను చవిచూస్తోంది అని, రెండు నెలలుగా రూ.153 కోట్ల నష్టం rtc కార్పొరేషన్ కు వచ్చిందని tgsrtc md నాగిరెడ్డి తెలిపారు. నేడు వరంగల్ రీజియన్ పరిధిలో పర్యటించిన ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఆర్టీసీ కార్పోరేషన్ కు రెండు నెలల్లో రూ.153 కోట్ల నష్టం
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఈ వర్షాకాలంలో వస్తున్న నష్టాల నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నష్ట నివారణ చర్యలను ఏ విధంగా తీసుకోవాలి అనేదాని పైన చర్చించినట్టు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో జూన్ నెలలో 78 కోట్లు, జూలై నెలలో 75 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. రెండు నెలలలో 153కోట్ల నష్టం వచ్చిందని అన్నారు.
వర్షాకాలంలో ఆర్టీసీ ఆదాయం తగ్గుతుందన్న ఎండీ
ఇక వరంగల్ రీజియన్ పరిధిలో జూన్ నెలలో 8.5 కోట్లు, జూలై నెలలో 8 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆయన అన్నారు. సహజంగా వర్షాకాలంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుందని, వర్షాల కారణంగా ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేయరని, ఈ సమయంలో కాస్త ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఈ కారణాలతోనూ ఆర్టీసీకి నష్టాలు
అయితే వర్షాకాలం తో పాటు, ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెరగడం, డీజిల్ ధరలు పెరగడం ఇవన్నీ కూడా ఆర్టీసీ సంస్థ పై ఆర్థిక భారాన్ని పెంచాయని ఆర్టిసి ఎండి నాగిరెడ్డి స్పష్టం చేశారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏం చేయాలి అనే దానిపైన రీజియన్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
నష్ట నివారణ చర్యలను చేపడతామన్న ఆర్టీసీ ఎండీ
ఆర్టీసీలో ఖర్చులు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఆదాయం పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి సంస్థ తీసుకోవలసిన నిర్ణయాలు ఏమిటి అన్న దానిపైన చర్చిస్తున్నాం అన్నారు. నష్ట నివారణ చర్యలను చేపడతామని ఆయన స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications