మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా

వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాను పలుసార్లు అధిష్టానం దృష్టికి తెచ్చానని, వైయస్ మరణించి రెండు నెలలైనా గానీ సిఎల్పీలో గానీ శాసనసభలో గానీ శాసనమండలిలో గానీ సంతాపం ప్రకటించలేకపోవడం మనస్తాపం కలిగించిందని, అటువంటి మహానాయకుడి మరణాన్ని జీర్ణించుకోలేక, ఆయన లేని మంత్రివర్గంలో కొనసాగలేక కొట్టుమిట్టాడుతున్నానని, దాంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె తన లేఖలో వివరించారు.
వైయస్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కాకుండా కుట్ర చేశారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూడా జగన్ ముఖ్యమంత్రి కాకుండా కుట్ర చేశారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. అంతా సద్దుమణిగిందని అనుకుంటున్నారని, కానీ ఆంధ్ర రాష్ట్రం అగ్ని పర్వతంలా ఉందని, అది ఎప్పుడు పేలి లావా పొంగుతుందో చెప్పలేనని ఆమె అన్నారు. ఇబ్బందులు కలిగించకూడదని జగన్, కెవిపి కోరినందుననే అల్లకల్లోలం జరగకుండా ఆగిపోయిందని ఆమె అన్నారు. జగన్ కోసం రాజీనామా చేస్తానని ప్రకటించి తర్వాత మాట మార్చానని మీడియాలో వార్తలు రావడం వల్ల తాను మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నానని ఆమె చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇస్తే రాజీనామాను ఉపసంహరించుకుంటానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications