న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు కోర్ కమిటీ నిర్ణయం వాయిదా పడింది. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని మంగళవారం సాయంత్రం కాంగ్రెసు అధిష్టానం ప్రకటిస్తుందని ఆశించారు. కానీ అది వాయిదా పడింది. ప్రకటన రూపకల్పనకు జరగాల్సిన కోర్ కమిటీ సమావేశం వాయిదా పడింది. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కోల్ కత్తాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. చిదంబరం లేకున్నా కోర్ కమటీ సమావేశం జరగవచ్చు. కానీ తెలంగాణపై చిదంబరం లేకుండా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోతున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రత్యేక రాష్టానికి తప్ప మరో దానికి ఒప్పుకునేది లేదని వారు ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖలు ఫ్యాక్స్ చేశారు.
మంగళవారం ఉదయం నుంచి ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, వీరప్ప మొయిలీలతో కోస్తాంధ్ర, రాయలసీమ పార్లమెంటు సభ్యులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కూడా వారు సమావేశమయ్యారు. హైదరాబాదులో ఉన్న తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ స్థితిలో పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం కసరత్తు చేశారు. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి, ప్రాంతీయ బోర్డుల పునరుద్ధరణ వంటి కొన్ని గ్యారంటీల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గాలని కాంగ్రెసు అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనికి తెలంగాణ పార్లమెంటు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ స్థితిలో కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా, వస్తే రేపు ఒక ప్రకటన రావాల్సి వస్తుంది. లేదంటే నిర్ణయం మరింత కాలం వాయిదా పడే అవకాశం ఉంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి