హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాద ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుపై కాంగ్రెసు నాయకుడు, మాజీ హోం మంత్రి టి. జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మోహన్ బాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవడీ మోహన్ బాబు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించడానికి మోహన్ బాబు ఎవరని ఆయన అడిగారు. మోహన్ బాబు తైతక్కలాడితే తాము చూడాలా, ఇక్కడ డబ్బులు సంపాదించుకుని తెలంగాణ ఆకాంక్షను నీరు గార్చడానికి మోహన్ బాబు ప్రయత్నిస్తారా అని ఆయన అన్నారు. మోహన్ బాబు రాజకీయాలకు అతీతంగా లేరని ఆయన అన్నారు. ఆయన శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.
సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజుకు ఎకరాల కొద్ది భూములను కట్టబెట్టడంపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రామలింగరాజు ఉద్యోగాలు తెలంగాణవారికి ఇవ్వలేదని, భూములేమో తెలంగాణవి తీసుకున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేయాలని ఆయన సూచించారు. అసాంఘిక శక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణపై తమ అధిష్టానం దిగిరాకుంటే కాంగ్రెసు పార్టీకి తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. విభజన కోరే ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం జరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి