హైదరాబాద్: రాష్ట్రం నుంచి తెలంగాణను విడిగొట్టే సమయంలో రాయలసీమ గురించి కూడా ఆలోచించాలని కాంగ్రెసు శాసనసభ్యుడు, రాయలసీమ హక్కుల కమిటీ కన్వీనర్ టిజి వెంకటేష్ బిజెపి, సిపిఐ, ఇతర జాతీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. తాము సమైక్యాంధ్రలో ఉండడానికే ఇష్టపడతామని, అయితే తప్పనిసరిగా విభజించాల్సి వస్తే రాయలసీమ వెనకబాటు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని, రాయలసీమకు, ఆంధ్రకు మధ్య ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో కుదిరిన శ్రీబాగ్ ఒడంబడిక అమలు గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో ఇరు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చేపడుతున్న బంద్ ల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే విప్లవాలు వస్తాయని ఆయన అన్నారు.
తెలుగుదేశం, సిపిఐ, బిజెపి ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందున రాయలసీమ గురించి కూడా ఆ పార్టీలు ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తెర మీదికి వచ్చినప్పుడే రాయలసీమ అంశం చర్చకు వస్తుందని, అందుకు తాము సమైక్యంగా ఉండాలని భావించడమే కారణమని, అలా సాధ్యం కానిపక్షంలో రాయలసీమ వెనకబాటుతనం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పాల్సిన అవసరం ఏర్పడుతోందని ఆయన అన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, కర్నూలును దేశం రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య నినాదం తీసుకున్నందుకు ప్రజారాజ్యం పార్టీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలోని సీమాంధ్ర నేతలకు ప్రస్తుతం కొంత స్వేచ్ఛ లభించిందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి