న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని రాష్ట్ర కాంగ్రెసు తెలంగాణ నాయకులు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రక్రియను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న స్థితిలో చర్చల ప్రక్రియనే మార్గమనే కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ సాగుతుందని కూడా అంటున్నారు. అయితే ఇందుకు గాను రిటైర్డ్ న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెసు నాయకులకు అధిష్టానం నుంచి స్పష్టమైన వివరణ లభించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రజల నుంచి ఒత్తిడి తట్టుకోవడమెలా అనేదే వారికి అంతుబట్టడం లేదు.
తెలంగాణపై తమ డెడ్ లైన్ తమకు ఉందని, ఒత్తిళ్లకు లొంగబోమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సోమవారం చెప్పారు. ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ జెఎసి పెట్టిన గడువుపై ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి విధించిన డెడ్ లైన్ తో తమకు సంబంధం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలనే తమ ఆలోచనలో మార్పు లేదని కూడా ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసే అవకాశాలున్నాయని ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న తెలంగాణ కాంగ్రెసు నాయకులు తాజాగా చెబుతున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి