రాయలసీమ స్పెషల్ 'నాటుకోడి కరివేపాకు వేపుడు'.. ఇలా చేస్తే టెస్ట్ నెక్స్ట్ లెవెల్..!
సండే వచ్చిందంటే చాలు.. చాలామందికి నాన్ వెజ్ తినాలని కోరిక ఉంటుంది. పొద్దుపొద్దునే చికెన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. అయితే ఎప్పుడూ చికెన్ కాకుండా ఈ సారి నాటుకోడి ట్రై చేయండి.. అది కూడా ఆంధ్రా స్టైల్ లో.. మరి రాయలసీమ స్పెషల్ నాటుకోడి వేపుడు తయారీ ఎలా..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..? ఇక్కడ చూద్దాం..
రాయలసీమ స్పెషల్ నాటుకోడి కరివేపాకు వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. నాటుకోడి ముక్కలు ఒక కిలో, కరివేపాకు ఒక కప్పు( సగం వేపుడు కోసం, సగం తాళింపు కోసం), అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ లు, నూనె నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు రెండు పెద్దవి, ఎండుమిర్చి ఆరు నుంచి ఎనిమిది, పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ లు, గరం మసాలా పొడి, కారం పొడి రెండు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి.
ఇప్పుడు రాయలసీమ స్పెషల్ నాటుకోడి కరివేపాకు వేపుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా నాటుకోడి ముక్కలను శుభ్రం చేసుకోవాలి. వాటిని ఒక పాత్రలోకి తీసకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసి కొన్ని నీళ్లు పోయాలి. అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొన్ని కరివేపాకు ఆకులను నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి. దీన్ని చివర్లో పొడి చేయాల్సి ఉంటుంది. ఇక అదే బాణలిలో తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి అలాగే మిగిలిన కరివేపాకు ఆకులను వేసి తాళింపు పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉడికించుకున్న నాటుకోడి ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం పొడి వేసుకోవాలి. అలా వేపుడు బాగా ఎర్రగా అయ్యేంత వరకూ వేయించుకోవాలి. చివరగా అందులో వేయించి పొడి చేసుకుని పెట్టుకున్న కరివేపాకు పొడిని వేయాలి. ఇప్పుడు మొత్తం ఓసారి కలిపి దింపుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ రాయలసీమ స్పెషల్ నాటుకోడి కరివేపాకు వేపుడు కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications