హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీని ఇబ్బందిలో పెట్టవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు. మంగళవారం గణ తంత్రదినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో జాతీయ పతాకను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణపై సమస్య 50 ఏళ్లుగా ఉందని, సమస్య పరిష్కారానికి పార్టీ అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తోందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తేనే రాజ్యాంగ ప్రక్రియ సవ్యంగా సాగుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. రాగద్వేషాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన సూచించారు.
తెలుగు ప్రజల మధ్య ద్వేషాలు పెంచవద్దని కూడా ఆయన సూచించారు. కీలక సమస్యలు కూడా శాంతియుతంగానే పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. కాంగ్రెసు బలోపేతం అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుత రోశయ్య ప్రభుత్వం కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లోనే నడుస్తోందని ఆయన చెప్పారు. వైయస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా పాల్గొన్నారు. శాసనమండలి ఆవరమలో చైర్మన్ చక్రపాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి