ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు అనుకూలంగా మారిన పశ్చిమ గోదావరి కార్యకర్తలు

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలు జగన్ కు అనుకూలంగా మారినట్టు కనిపిస్తోంది. ముందున్నవి స్థానిక ఎన్నికల సమరాంగణం కానుండటంతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ చేటును తెస్తాయన్నది అధికార పార్టీ నేతల్లోను, కార్యకర్తల్లో కలవరపాటు నెలకుంది. తిరిగి ప్రారంభమైన జగన్‌ ఓదార్పు యాత్ర శ్రీకాకుళంలో భారీ ఎత్తున విజయవంతం కావడంతో ఇక్కడి జిల్లాలోని జగన్‌ వర్గంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైయస్సార్‌ జయంతి వేడుకలకు ఆఖరి నిమిషాన అధికార యంత్రాంగానికి ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ కావడం పట్ల కూడా కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు.

ఓ మహానేత ముఖ్యమంత్రి హోదాలో అనూహ్యంగా హెలీకాఫ్టర్‌ దుర్ఘటనలో అసువులు బాసితే వైయస్సార్‌ జయంతి వేడుకల్ని వారం రోజులు ముందుగానే కట్టుదిట్టమైన ఆర్భాట, హంగామాలతో చేయాల్సి ఉండగా సిఎం రోశయ్య సర్కార్‌ ఎందుకనో మీనమేషాలు లెక్కించిందనే ఆరోపణలు జగన్‌ వర్గం నుంచి విన్పిస్తున్నాయి. వైయస్సార్‌ జయంతి వేడుకలను విస్మరిస్తూ గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడాన్ని కూడా జిల్లాలోని జగన్‌ వర్గం తప్పు బడుతోంది. జిల్లాలోని ఇద్దరు పార్లమెంటు సభ్యులైన కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు పరోక్షంగా జగన్‌నే సమర్థిస్తున్నారని సమాచారం. ఆకివీడులో నర్సాపురం పార్లమెంటు సభ్యులు బాపిరాజు అక్కడి వైయస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి శాసనసభ్యులు మద్దాల రాజేష్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జగన్‌ వెంట ట్రైన్‌లో హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చారని తెలుస్తోంది.

ఆళ్లనాని జగన్‌ శ్రీకాకుళం ఓదార్పు యాత్రను అనుసరించగా, మిగతా ఆ ఇద్దరు యువ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఏర్పాటైన వైయస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నర్సాపురం నియోజకవర్గంలోనూ అక్కడి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వైయస్సార్‌ జయంతి వేడుకల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. కాగా చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ గురువారం రాత్రి జగన్‌ శ్రీకాకుళం ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు పయనమైనట్లు తెలుస్తోంది. నర్సాపురం, పోలవరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హడావుడిగా రాజధానికి తిరుగుముఖం పట్టారు. జగన్‌ వర్గీయుడుగా ఉన్న భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు విదేశాల్లో ఉండగా, పలువురు శాసనసభ్యులు మాత్రం హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల హడావుడిలో ఉండిపోయారు. అటు పార్టీ అధిష్టానాన్ని కాదనలేక, ఇటు తమ పదవుల ప్రాణ ప్రదాత వైయస్సార్‌ను మరవలేక కొందరు పార్టీ ఎమ్మెల్యేలు లోలోన తెగ మధనపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కొన్ని ఒత్తిళ్ల కారణంగా తాము నేరుగా వచ్చి కలవలేకున్నామని, వీలు చేసుకుని తప్పక వచ్చి ఓదార్పు యాత్రలో పాల్గొంటామని జగన్‌కు జిల్లాలోని శాసనసభ్యులు పలువురు భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ వాణీ ప్రసాద్‌, ఎస్పీ రవివర్మ , ఇతర ముఖ్య శాఖలకు చెందిన అధికారులు వైయస్సార్‌ చిత్రపటాల్నుంచి ఘనంగా నివాళులు అర్పించారు. జెడ్పీ చైర్మన్‌ మేకా శేషుబాబు ఏలూరుతో పాటు తన పాలకొల్లు ప్రాంతంలో ఏర్పాటైన వైయస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. త్వరలోనే జగన్‌ ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు ఆయన సిద్దపడ్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రోశయ్య పుట్టిన రోజు వేడుకల్ని ఫ్లెక్సీలతో పాలకొల్లులో ఎంతో సంబరంగా జరుపుకున్న అక్కడి మహిళా శాసనసభ్యురాలు వైయస్‌ జయంతి వేడుకల్లో స్థానికంగా పాల్గోకపోవడంపై ఆమె ప్రత్యర్థి వర్గం తప్పు బడుతున్నట్లు సమాచారం.

పాలకొల్లు ఎమ్మెల్యే ఉషారాణి హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున నియోజకవర్గంలో జరిగిన వైయస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గోలేకపోయారని ఆమె వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. త ణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పరిసర ప్రాంతాల్లోనూ ద్వితీయ శ్రేణి నేతలతో వైయస్‌ జయంతి వేడుకలు ఎంతో ధూం...ధాం అంటూ సాగాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు ఆపి ప్రయాణికులకు కాంగ్రెసు నేతలు స్వీట్లు పంచారు. మరి కొన్ని చోట్ల దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అధికారులు సైతం కొందరు వైయస్సార్‌ జయంతి వేడుకల సందర్భంగా తమకెదురైన వృద్ధులకు పింఛన్లు అందుతున్నాయా..? లేదా..? అనేదానిపై ఆరా తీశారు. కొందరు నేతలు డుమ్మా కొట్టినా సరే ద్వితీయ శ్రేణి నేతలు రెట్టించిన ఉత్సాహంతో జిల్లా వ్యాప్తంగా వైయస్‌ జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల్లో చూస్తే కాంగ్రెసుకు 9 స్థానాలు దక్కాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X