రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త: కొత్త పథకానికి ఆమోదం!
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81.35 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు, అక్రమాలకు తావులేకుండా చేసేందుకు 'సార్థక్ పీడీఎస్' అనే నూతన పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా సాంకేతికతను జోడించి రేషన్ పంపిణీని రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు.
సార్థక్ పీడీఎస్ పథకం ఆమోదించిన కేంద్రం
కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పథకం గురించి కీలక వివరాలు వెల్లడించారు. ప్రధానంగా రేషన్ బియ్యం మరియు ఇతర ఆహార ధాన్యాలు పక్కదారి పట్టకుండా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 25,530 కోట్లు ప్రకటించింది. వచ్చే ఐదేళ్ల పాటు ఈ నిధులు పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి ఉపయోగిస్తారు.

రియల్ టైం మానిటరింగ్ , బయోమెట్రిక్ ధృవీకరణ
గోదాముల నుండి చౌక ధరల దుకాణాల (FPS) వరకు ధాన్యం ఎలా వెళ్తోంది, ఎంత మందికి పంపిణీ అయిందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు. దీనికోసం ప్రత్యేక అప్లికేషన్‌ను తీసుకురానున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా ఆధార్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణను మరింత బలోపేతం చేస్తారు. దీనివల్ల నకిలీ కార్డులకు చెక్ పడుతుంది.
రేషన్ కార్డుల నిర్వహణ, కొత్త దరఖాస్తుల ప్రక్రియ ఈజీగా
రేషన్ రవాణా, గిడ్డంగుల నిర్వహణ, మరియు డీలర్ల మార్జిన్ వంటి ఖర్చులను ఈ పథకం ద్వారా కేంద్రమే భరిస్తుంది. తద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ సంస్కరణల వల్ల పేదలకు నాణ్యమైన ఆహార ధాన్యాలు సరైన సమయంలో అందుతాయి. రేషన్ కార్డుల నిర్వహణ, కొత్త దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇకపై మరింత సరళతరం కానుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
అక్రమ రేషన్ కార్డు దారులకు చెక్ పెట్టేలా కేంద్రం నిర్ణయం
రేషన్ విషయంలో అసలైన లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా, అక్రమ రేషన్ కార్డు దారులకు చెక్ పెట్టేలా కేంద్రం సార్థక్ పీడీఎస్ పథకం తీసుకు వస్తుంది. మరి ఈ పథకం ఏ మేరకు సామాన్యులకు మేలు చేకూరుస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications