114 మందితో వెళ్తున్న పడవ మునక.. 15 మంది మృతి.. 25 మంది గల్లంతు
జింబాబ్వేలోని కరిబా సరస్సులో తీవ్ర విషాదం నెలకొంది. జింబాబ్వే- జాంబియా మధ్య సరిహద్దుగా ఉన్న కరిబా సరస్సులో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 27 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 77 మందిని సహాయక బృందాలు రక్షించాయి. సరస్సులోని ఓ చిన్న ద్వీపానికి క్షతగాత్రులను తరలించాయి. అక్కడి నుంచి పడవల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం అవుతున్నాయి. అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం కారణంగానే పడవ మునిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
జింబాబ్వేకు చెందిన బ్రాడ్ కాస్టర్ జేబీసీ తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. టికెట్ తీసుకున్న వారి వివరాలను బట్టి ఘటన సమయంలో ఈ పడవలో 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ వివరాలను జింబాబ్వే సివిల్ ప్రొటెక్షన్ యూనిట్ కూడా ధ్రువీకరించింది. అయితే ఈ ప్రయాణానికి చిన్నారులకు టికెట్ లేదు. వారిని కూడా కలుపుకుంటే ఈ లెక్క ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ పడవలో ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని జింబాబ్వే సివిల్ ప్రొటెక్షన్ యూనిట్ పేర్కొంది. ఈ ఫెర్రీ సామర్థ్యం 90 మంది ప్రయాణికులు మాత్రమే కాగా.. సామర్థ్యానికి మించిన ప్రయాణికులు పడవలో ఎక్కిన కారణంగానే పడవ మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక కరిబా సరస్సులో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. జింబాబ్వే పోలీసులు, సహాయక బృందాలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. కరిబా సరస్సు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రమాదం నుంచి క్షతగాత్రులను రక్షించడం సమస్యగా మారినట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు మృతదేహాలను వెలికి తీయడం కూడా సహాయక బృందాలకు సవాలుగా మారింది.

ఇక ఈ పడవను కరిబా పట్టణానికి వెళ్లేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఇక ఈ కరిబా సరస్సు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మానవ నిర్మిత సరస్సుగా గుర్తింపు పొందింది. ఈ సరస్సు జింబాబ్వే- జాంబియా దేశాల మధ్య సరిహద్దుగా ఉంటుంది. జాంబేజీ నదిపై ఆనకట్ట నిర్మించడంతో ఈ సరస్సు ఏర్పడింది. మరోవైపు ప్రయాణ సమయంలో వినియోగించిన పాత పడవ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పార్లమెంటు సభ్యురాలు ముత్సా మురోంబెడ్జీ అంచనా వేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications