హిమాలయాల్లో పెను ముప్పు! బయటపడ్డ ప్రమాదకర మార్పులు!!
ఉత్తరాఖండ్‌లోని హిమానీనదాలు వేగంగా కరిగిపోతుండటం భారతదేశ నీటి భద్రతతో పాటు హిమాలయ ప్రాంత భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోంది. ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల ఘటన మరువకముందే ఉత్తరాఖండ్‌లోని 23 ప్రధాన హిమానీనదాలపై వెలువడిన కొత్త పరిశోధనా ఫలితాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
వాడియా ఇన్‌స్టిట్యూట్ పరిశోధన
'వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ' సైంటిస్టులు 23 హిమానీనదాల చారిత్రక ఆధారాలను సమగ్రంగా విశ్లేషించి, వాటి తగ్గుదల రేట్లలో తీవ్ర వ్యత్యాసాలను కనుగొన్నారు. 'డిస్కవర్ జియోసైన్స్' పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. కేవలం ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా.. భూమి వాలు, పరిమాణం, మంచుపై పేరుకుపోయే శిథిలాల పొరలు కూడా గ్లేసియర్లు కరగడాన్ని వేగవంతం చేస్తున్నాయని తేలింది. ముఖ్యంగా శిథిలాలు లేని స్వచ్ఛమైన మంచు ఉన్న హిమానీనదాలు మరింత వేగంగా కరిగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పిండారీ, గంగోత్రి హిమానీ నదాల క్షీణత
ఈ అధ్యయనంలో పిండారీ, గంగోత్రి, మిలామ్, ఖాట్లింగ్ వంటి ప్రధాన హిమానీనదాల కరుగుదల రేట్లను వెల్లడించారు. పిండారీ హిమానీనదం 1845-1966 మధ్య ఏటా సగటున 23.4 మీటర్ల మేర తగ్గగా.. 2000-2018 నాటికి అది ఏకంగా ఏడాదికి 45.85 మీటర్లకు పెరిగింది. అలాగే ఖాట్లింగ్ హిమానీనదం ఏటా సుమారు 88 మీటర్లు, మిలామ్ గ్లేసియర్ 32 నుంచి 37.8 మీటర్లు, గంగోత్రి గ్లేసియర్ చాలా కాలంగా ఏటా 22 మీటర్ల చొప్పున వెనక్కి తగ్గుతున్నాయి. సతోపంత్, రమణి, బందర్‌పూంచ్, డోకియాని వంటి ఇతర గ్లేసియర్లు కూడా తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి.
నదీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం
ఉత్తరాఖండ్‌లోని హిమానీనదాలు భారత్‌లో జీవనదులైన గంగా, యమునా, అలకనంద, భాగీరథి వంటి ప్రధాన నదీ వ్యవస్థలకు ఆయువుపట్టుగా పనిచేస్తున్నాయి. తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఇవే ఆధారంగా ఉన్నాయి. గ్లేసియర్లు వేగంగా కరగడం వల్ల హిమానీనద సరస్సులు పొంగిపొర్లి ఆకస్మిక వరదలు, హిమపాతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పులు
భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడం, శీతాకాలంలో హిమపాతం తగ్గడం, వేసవికాలం నిడివి పెరగడమే ఈ వేగవంతమైన కరుగుదలకు ప్రధాన కారణాలు. గతంలో ఎత్తైన ప్రాంతాల్లో కేవలం మంచుపడే చోట ఇప్పుడు వర్షపాతం నమోదు కావడంతో కొత్తగా మంచు పేరుకుపోవడం బాగా తగ్గింది. హిమానీనదాలు కరిగిపోవడం వల్ల ఆరంభంలో నదుల్లో ప్రవాహం పెరిగినట్లు కనపించినప్పటికీ.. దీర్ఘకాలంలో మంచు నిల్వలు తరిగిపోయి నదుల్లో నీటి లభ్యంగా గణనీయంగా పడిపోతుంది. ఇది దిగువ ప్రాంతాల ప్రజల తాగునీటి సరఫరాను, వ్యవసాయాన్ని దెబ్బతీసి తీవ్ర నీటి సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
