భీమిలిలో కేజీబీవీలో 10మంది బాలికల జడలు కత్తిరింపు కలకలం!
విశాఖపట్నం జిల్లా భీమిలిలో వింత సంఘటన జరిగింది. భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్‌లో ఊహించని సంఘటనతో ఇప్పుడు కలకలం రేగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న పదిమంది విద్యార్థినుల జడలు రాత్రి వేళ గుర్తు తెలియని అగంతకులు కత్తిరించారు. ఈ నెల 16న రాత్రి జరిగిన ఈ సంఘటన తాజాగా బయటపడింది.
హాస్టల్‌లో 9వ తరగతి బాలికలు మొత్తం 38 మంది ఉన్నారు. వారికి రెండు గదులు కేటాయించారు. ఆ రోజు రాత్రి 12 గంటల వరకు ప్రమీల అనే ఉపాధ్యాయురాలు స్టడీ అవర్ నిర్వహించారు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే పదిమంది జడలు కత్తిరించి ఉన్నాయి. ఒక గదిలో 20మంది నిద్రించగా వారిలో ఆరుగురి జడలు, మరో గదిలో 18మందిలో నలుగురి జడలు కత్తిరించారు.

ఆసక్తికరంగా, రెండు జడలు వేసుకున్న బాలికలను తాకలేదు. ఒక్క జడ మాత్రమే వేసుకున్నవారి జుత్తునే కత్తిరించారు. హాస్టల్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉంది. బయట నుంచి ఎవరైనా లోపలికి రావడం కష్టం. అందువల్ల తోటి విద్యార్థినులే చేసి ఉండవచ్చని అనుమానాలు వస్తున్నాయి. అయితే బయట జుట్టుకు విపరీతమైన ధర ఉన్న క్రమంలో బయట నుండి వచ్చిన వారు కూడా చేసి ఉండొచ్చు అన్న అనుమానం కూడా లేకపోలేదు.
బాధిత బాలికలు వెంటనే ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినులు ఎవరిపైనా అనుమానం చెప్పలేదు. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు. బాధితుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈరోజు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ చెప్పారు. భద్రత ఉన్న హాస్టల్‌లో ఇలాంటి పని జరగడం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ పిల్లల జడలు కత్తిరింపు ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
