హైదరాబాద్ లో దారుణం.. హిట్ అండ్ రన్ లో మూడేళ్ల బాలుడిపైనుంచి వెళ్లిన కారు
హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్ లో దారుణమైన ఘటన జరిగింది. ఓ మూడేళ్ల చిన్నారిపై నుంచి ఓ దుండగుడు కారును వేగంగా నడిపాడు. చిన్నారిని కారుతో ఢీ కొట్టడమే కాకుండా అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కారును, దాని డ్రైవర్ ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఏం జరిగిందంటే..?
హైదరాబాద్- సంతోష్ నగర్ పరిధిలోని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులోని స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకురావడానికి మొహియుద్దీన్ వెళ్లాడు. అతనితోపాటు 3 ఏళ్ల కుమారుడు ఇజ్ఞాన్ ఉద్దీన్ కూడా ఉన్నాడు. పార్సెల్ తీసుకుని హోటల్ నుంచి బయటకు వస్తుండగా హోటల్ ముందు రోడ్డుపై అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చింది. ఇజ్ఞాన్ ఉద్దీన్ ను బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. అయితే తీవ్రంగా గాయపడిన ఇజ్ఞాన్ ఉద్దీన్ ను తండ్రి సమీపంలోని షాలిని ఆసుపత్రికి తరలించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు.

అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక సమాచారం అందుకున్న వెంటనే సంతోష్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కారును గుర్తించారు. అయితే ప్రస్తుతం కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
