'అక్కడ పల్లీ, బఠాణీలు అమ్ముకోవడానికి వెళ్లావా?'
ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3-0 తేడాతో ఘోర ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ దిగ్గజం వసీమ్ అక్రమ్ బాబర్ ఆజం కెప్టెన్సీని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జట్టులో జరుగుతున్న వరుస మార్పులపై బాబర్ ఆజంకు కనీస సమాచారం లేకపోవడం పట్ల వసీమ్ అక్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొదటి రెండు మ్యాచ్ లలో పరాజయం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సంచలన నిర్ణయాలు తీసుకుంది. కోచింగ్ స్టాఫ్ నుంచి సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్ లను తొలగించడంతో పాటు ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించింది. ఈ నిర్ణయాలపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఈ మార్పుల గురించి తనకు ముందే తెలియదని, ఆ విషయాన్ని పీసీబీని అడగాలని బాబర్ ఆజం బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చాడు. దీనిపై వసీమ్ అక్రమ్ ఘాటుగా స్పందిస్తూ.. " నాయకుడిగా ఉండి నీకేం తెలియకపోతే అక్కడ ఏం చేస్తున్నావు? ఏమైనా పల్లీ, బఠాణీలు అమ్ముకోవడానికి వెళ్లావా?" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబర్ ఆజం చూపించిన ఈ వైఖరి జట్టు ఆటగాళ్ల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డారు. "మైదానంలో ఉన్న ఆటగాళ్లకు వారి నాయకుడే అండగా నిలబడనప్పుడు వారు తమ 100 శాతం ప్రదర్శనను ఎప్పటికీ ఇవ్వలేరు" అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నారు. కెప్టెన్ స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకోకుండా బోర్డుపైకి నెట్టేయడం సరైన పద్దతి కాదని హితవు పలికారు.
షాన్ మసూద్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి మళ్లీ బాబర్ ఆజంకు ఆఫర్ చేసినప్పుడు.. అతను దానిని తిరస్కరించి ఉండాల్సిందని వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డారు. 'రెండో టెస్టులో ఓటమి తర్వాత బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని కేవలం బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతానని స్పష్టంగా చెప్పేయాల్సింది" అని వసీమ్ అక్రమ్ సలహా ఇచ్చారు.














Click it and Unblock the Notifications
