ఇది తథ్యం: డీలిమిటేషన్ పై తేల్చి చెప్పిన సీఎం విజయ్- కేంద్రానికి 4 డిమాండ్లు
దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ బిల్లుల ఆమోదం కోసమే పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశపర్చనుంది.
ఈ పరిణామాల మధ్య తమిళనాడు అసెంబ్లీ.. డీలిమిటేషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ఆధారంగానే రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక్క సీట్ పెరిగినా అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

నీట్ పరీక్ష, ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లులకు వ్యతిరేకంగా ఇప్పటికే తీర్మానాలు చేసిన తమిళనాడు ప్రభుత్వం.. ఇప్పుడు డీలిమిటేషన్‌పై కూడా వ్యతిరేకంగా గళం విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది ఉదారం కాదని, అది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశమని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని గుర్తుచేశారు.
ఈ పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ల అమలును ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు ప్రతిఫలంగా దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా తమిళనాడు పార్లమెంటు సీట్లను తగ్గించడం ఎంతమాత్రం సరికాదని తేల్చి చెప్పారు.
గత 50 ఏళ్లుగా దేశంలో సరైన జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ జరగలేదని, జనాభా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ ఉండకూడదని విజయ్ అన్నారు. దీంతో పాటు ఈ తీర్మానం ద్వారా కేంద్రం ముందు నాలుగు ప్రధాన డిమాండ్లను ఉంచారు.
1. లోక్‌సభ స్థానాల మొత్తం సంఖ్యను ప్రస్తుతమున్న 543 వద్దే శాశ్వతంగా కొనసాగించాలి.
2. వివిధ రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల కేటాయింపు నిష్పత్తిని ప్రస్తుత ప్రాతిపదికన పూర్తిగా స్తంభింపజేయాలి.
3. జనాభా, రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత 2.2:1 నిష్పత్తిని కొనసాగించాలి.
4. ఎలాంటి జాప్యం లేకుండా వచ్చే 2029 ఎన్నికల్లోనే మహిళల రిజర్వేషన్లను అమలు చేయాలి. ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ యధాతథంగా ఆమోదించింది.
లోక్‌సభ స్థానాల సంఖ్యను 550 నుంచి 850కి పెంచడం, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ లో వీగిపోయింది. దీనికి అవసరమైన మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆగిపోయింది. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినప్పటికీ, నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని దీనితో ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.














Click it and Unblock the Notifications