50 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్లు.. దరఖాస్తు చేసుకోవాలన్న ఏపీ సర్కార్!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చేనేతను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికుల జీవితాలకు ఆర్ధిక భరోసా కల్పించనుంది.చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 84 వేల మంది చేనేతలు పింఛన్లు పొందుతున్నారు. ఇప్పుడు మరికొంతమందికి , ముఖ్యంగా అర్హులైన చేనేత కార్మికులకు కొత్తగా పించన్లు మంజూరు చేయనుండటంతో లబ్దిదారుల సంఖ్య మరింత పెరగనుంది.కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు 15,521 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలిస్తున్నారు.

నిజమైన అర్హులను గుర్తించి పారదర్శకంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో చేనేతశాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేనేతలు మధ్యవర్తులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వవద్దని, గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో నేరుగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన పూర్తయిన తర్వాత లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి ప్రతి నెలా పింఛన్లు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నందున అర్హులు ఎదురుచూస్తున్నారు. చేనేతలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలవుతోంది.
అయితే ఈ పథకం అమలు అవుతున్న క్రమంలో దరఖాస్తుల పరిశీలన పేరుతో డబ్బులు వసూలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లంచాలు డిమాండ్ చేసిన అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసి, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పించన్ అందించనున్నారు. నిజమైన అర్హత ఉన్నా పించన్ రాని దరఖాస్తుదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.













Click it and Unblock the Notifications
