హనీమూన్‌లో పెను విషాదం.. బార్బెక్యూ మంటలకు బలైన నవవధువు!
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ నవదంపతుల ఆనందం ఎంతో కాలం నిలవలేదు. హనీమూన్ కోసం పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం డార్జిలింగ్ వెళ్లిన నవవధువు బార్బెక్యూ మంటల్లో తీవ్రంగా గాయపడి దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
చోప్రా ప్రాంతానికి చెందిన సమీర్ దాస్, నికితా సాహాలకు 2 నెలల క్రితమే వివాహమైంది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం ఈ జంట డార్జిలింగ్ జిల్లా సిటోంగ్‌లోని ఓ ప్రైవేట్ హోమ్ స్టే(రిసార్టు)కు వెళ్లారు. సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం వారు అక్కడ బార్బెక్యూ చేస్తుండగా.. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. చూస్తుండగానే ఆ మంటలు నికితా దుస్తులకు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే హోమ్‌స్టే సిబ్బంది, అక్కడున్న వారు మండలను ఆర్పి నికితాను ఆస్పత్రికి తరలించారు. మొదట సిలిగురిలో చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కోల్‌కతాకు తరలించారు. గత రెండు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నికితా ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం తుదిశ్వాస విడిచింది.

రిసార్టు నిర్లక్ష్యంపై భర్త ఆరోపణలు
ఈ ప్రమాదానికి హోమ్ స్టే యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని నికితా భర్త సమీర్ దాస్ ఆరోపించారు. బార్బెక్యూ గ్రిల్‌కు సమీపంలోనే నూనె డ్రమ్ము ఉండారని.. మంటల్లో ఆ నూనె పోయడం వల్లే మంటలు ఒక్కసారిగా భగ్గుమని తన భార్యకు అంటుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హోమ్ స్టే యజమాని ఈ ఆరోపణలను ఖండించారు. ఆ మంటల్లో ఏదో ద్రవాన్ని పోసింది తమ సిబ్బంది కాదని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అలా చేశారని ఆయన పేర్కొన్నారు. ఇరువర్గాల పరస్పర ఆరోపణలతో ఈ ఘటనపై వివాదం నెలకొంది. మరోవైపు పర్యాటక ప్రాంతాల్లోని ప్రైవేట్ రిసార్టులు, హోమ్ స్టేలలో బార్బెక్యూ వంటి కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు కనీస అగ్నిమాపక భద్రతా చర్యలు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.













Click it and Unblock the Notifications
