నాగబంధంలో హన్మకొండ సిద్ధేశ్వరాలయం.. రోజూ ఆలయం తెరవగానే అద్భుతం!
హన్మకొండలోని సిద్ధేశ్వరాలయంలో అద్భుత దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రతీరోజూ ఆలయ తలుపులు తెరిచిన వెంటనే గర్భగుడిలోని శివలింగం చుట్టూ ఒక నాగుపాము చుట్టుకుని ఉండటం అందర్నీ ఆకర్షిస్తోంది. ఆలయ అర్చకుడు సురేష్ చెప్పిన ప్రకారం ఈ అసాధారణ సంఘటన గత 15 ఏళ్లుగా వినాయక నవరాత్రుల సమయంలో తప్పనిసరిగా కనిపిస్తోంది.
ఒక నాగుపాము ప్రతి ఉదయం ఆలయం తెరిచే సమయానికి నాగుపాము నిశ్శబ్దంగా వచ్చి గర్భాలయం వైపు వెళ్లి శివలింగం చుట్టూ చుట్టుకుంటుంది. కొంతసేపు అలాగే ఉండి తర్వాత తనంతట తానుగా వెళ్లిపోతుంది. భక్తులు దీన్ని శివుని దివ్య ప్రత్యక్ష రూపంగా భావిస్తున్నారు. ఆలయం నాగబంధం, భైరవబంధంతో రక్షించబడుతోందని ఆలయ అర్చకులు చెప్తున్నారు.

ఈ నాగుపాము ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదు. కాబట్టి భక్తులు సురక్షిత దూరంలో నుంచి దర్శనం చేసుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇది ప్రత్యేక అనుభవంగా మారింది. శివునికి నాగుపాము అంటే ఎంత ప్రీతి అనే విషయాన్ని ఈ దృశ్యం గుర్తు చేస్తోంది. ఆలయ అర్చకులు, భక్తులు దీన్ని దైవ మహిమగా పరిగణిస్తూ పూజలు చేస్తున్నారు. హన్మకొండ సిద్ధేశ్వరాలయం ఇలాంటి అద్భుతాలతో భక్తుల మనసులను ఆకట్టుకుంటోంది.
హన్మకొండలో ఉన్న సిద్దేశ్వర ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజులచే పూజలందుకున్న ఆలయం. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట కంటే ముందే ఈ ఆలయం ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో కొలువైన సిద్దేశ్వర స్వామి స్వయంభువు. శాండిల్య మహర్షి చేసిన ఘోర తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిసారని స్థల పురాణం చెప్తుంది.
ఇక్కడ ఉన్న సిద్ధుల గుట్టపై సిద్ధులు, యోగులు తపస్సు చేయటం వలన ఈ శివయ్య సిద్దేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. ఇప్పటికీ అర్దరాత్రి సమయంలో ఇక్కడ ఋషులు ప్రణవ నాదంతో సిద్దేశ్వరునికి పూజలు చేస్తారని చెప్తారు. ఈ ఆలయం కాకతీయ రాజు ప్రోలరాజు 1 నిర్మించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయం కాకతీయ, చాళుక్య శిల్ప కళా వైభవాన్ని చాటుతుంది. ఈ ఆలయం చుట్టూ రక్షణగా నవ సిద్ధ, కాలభైరవ విగ్రహాలు ఉన్నాయి. తాంత్రిక పరిరక్షణలో భాగంగా నాగబంధం, భైరవ బంధనం ఉండటం కూడా చాలా ప్రత్యేకత.













Click it and Unblock the Notifications
