తాడిపత్రి భగ్గు- కేతిరెడ్డి ఇల్లు, వాహనాలు బుగ్గి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఇంటికి నిప్పు పెట్టారు. రాళ్లు విసిరారు. ఇంటి పార్కింగ్ స్థలం, బయట నిలిపివుంచిన వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనలో పెద్దారెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. కేతిరెడ్డి, ఆయన అనుచరలకు చెందిన 10 స్కార్పియో వాహనాలు ధ్వంసం అయ్యాయి. 20కి బైక్‌లకు నిప్పు పెట్టారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అవన్నీ కూడా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు గానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ తాడిపత్రిలో జేసీ వర్గం కేతిరెడ్డి పెద్దారెడ్డి పై తరచూ దాడులకు పాల్పడుతూనే వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఇవి తీవ్రరూపాన్ని దాల్చాయి. గురువారం నుంచీ వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయని పార్టీ వర్గాలు ఆరోపిస్తోన్నాయి. ఈ ఉదయం ఇవి మరింత తీవ్రం అయ్యాయి.
పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతోన్న విషయంపై ఈ ఉదయం పెద్దారెడ్డి పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. దీని తర్వాత జేసీ వర్గం మరింత రెచ్చిపోయిందని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. మూకుమ్మడిగా వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆయన ఇంటి వద్ద 10 స్కార్పియో వాహనాలను ధ్వంసం చేశారు. సుమారు 20 బైక్‌లకు నిప్పు పెట్టారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించిన ప్రత్యర్థులు పెట్రోల్ బాంబులు విసురుతూ తీవ్ర విధ్వంసానికి ఒడిగట్టారని వివరించారు. నివాసం వద్ద ఉన్న జనరేటర్‌ను కూడా తగలబెట్టారు.
తాడిపత్రిలో చోటుచేసుకున్న ఈ హింసాత్మక ఘటనల దృష్ట్యా పట్టణంతో పాటు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో తదుపరి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యమైన కూడళ్ళు, సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, రాకపోకలు సాగిస్తున్న ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
