విజయవాడ శాప్ ఆఫీస్ వద్ద నిరసనలకు వైసీపీ ప్రయత్నం
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాప్ కార్యాలయం ఎదుట నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడం, అటు వైపు వెళ్లడానికి ప్రయత్నించిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్ఆర్సీపీ నిరసన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాప్ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు అమర్చారు. శాప్ ఆఫీస్ కు వెళ్లే మార్గాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులను పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఈ నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంక్షలు అమలులో ఉండటం, శాంతిభద్రతలు, ట్రాఫిక్ పరిస్థితులను కారణాలుగా చూపుతూ ర్యాలీ, ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలు శాప్ కార్యాలయం వైపు తరలివచ్చారు. మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు పలువురు పార్టీ నేతలు అక్కడికి చేరుకుని డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై నిరసన తెలిపారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది.
శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చిన తమను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు నిలదీశారు. వైసీపీకి ఒక న్యాయం, టీడీపీ కూటమికి మరో న్యాయంగా పోలీసులు వ్యవహరిస్తోన్నారంటూ మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో తలెత్తిన అనుమానాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు. దీన్ని సాధించేంత వరకూ విశ్రమించబోమని అన్నారు.
విజయవాడ నిరసనకు తరలివచ్చే వైఎస్ఆర్సీపీ నేతలను ఇతర జిల్లాల్లోనూ పోలీసులు అడ్డుకున్నారు. బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయనను బాపట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు.
కాగా.. దేశం గర్వించేలా క్రీడల్లో రాణించి టీచర్ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులపై ఈ సందర్భంగా వైసీపీ దాడికి ప్రయత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేద, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత క్రీడల్లో ప్రతిభను చాటుకుని, రాష్ట్రం, దేశం గర్వించేలా విజయాలు సాధించిన వారిపై ఇలా దాడికి ప్రయత్నించడం వెనుక కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఉద్యోగ సాధకులపై శాప్ కార్యాలయం ముట్టడి పేరుతో దాడికి దిగాలనుకోవడం హేయమైన చర్యగా అభివర్ణిస్తోంది.
విజయవాడలో పొలిటికల్ హీట్.. శాప్ కార్యాలయం ముట్టడికి వైసీపీ యత్నం..!!#YSRCP #VijayawadaSAP #SAPoffice #AndhraPradesh #PoliticsToday #OIReels #Oneindiatelugu pic.twitter.com/xXASlgqfUZ
— oneindiatelugu (@oneindiatelugu) September 21, 2026














Click it and Unblock the Notifications
