ఖైరతాబాద్ ఉప ఎన్నిక సీటు సీఎం సన్నిహితుడుకే..!? దానంకు దక్కేదేంటి..!?
ఖైరతాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది. దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటుతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాగా, దానం సుప్రీంని ఆశ్రయించారు. బుధవారం పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇటు.. ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ఫిక్స్ చేసింది. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి అభ్యర్ధి విషయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. దానం నే బరిలోకి దింపుతారా.. మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయి కిరణ్ పేరు దాదాపు ఫిక్స్ అయింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు తిరిగి దానం నాగేందర్ కు ఖాయమని భావిస్తున్న వేళ పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. దానం తన పైన హైకోర్టు అనర్హత వేటు వేయటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపు ల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్ 23) విచారణ జరపనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు తీర్పు తరువాత నిర్ణయం
కాగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో, ఆ స్థానానికి రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా సాగుతోంది. సీఎం రేవంత్ కు ఆప్తుడిగా ఉన్న రోహిన్ రెడ్డిని ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్న ట్లు చెబుతున్నారు. కాగా.. రోహిన్ రెడ్డితో పాటు విజయారెడ్డి, కేకే కుమార్తె విజయలక్ష్మీ పేరు రేసులో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినందకు అనర్హత వేటు వేయటంతో.. కాంగ్రెస్ నుంచి తిరిగి పోటీ కంటే.. ఎమ్మెల్సీ పదవి దానం కు కేటాయించాలనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే... తనకు మంత్రి పదవి ఇస్తే.. ఎమ్మెల్సీ పదవికి దానం అంగీరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో.. సుప్రీంలో దానం పిటీషన్ పైన స్పష్టత వచ్చిన తరువాత కాంగ్రెస్ తమ అభ్యర్ధి విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది.













Click it and Unblock the Notifications
