వైయస్ జగన్ కాంగ్రెసు రాజకీయాల్లో కార్నర్ అయ్యాడా?

కొండా సురేఖ, అంబటి రాంబాబు వంటి కొంత మంది వీరభక్తులు జగన్ ను అధికారంలో చూడాలని అనుకోవడం, ఆయన ఏది చేయమంటే అది చేయడం వింతేమీ కాదు. వారికి అదును చూసి ముందుకు అడుగేయాలనే అనుభవం ఉంటుందని అనుకోవడానికి లేదు. జగన్ కోసం వారు తమ రాజకీయ భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టడానికి సిద్ధపడినవారు. రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన నాయకులకు కూడా సలహాదారులుంటారు. జగన్ కు అటువంటి సలహాదారులు ఇప్పుడు ఉన్నట్లు కనిపించడం లేదు. జగన్ ను రాజకీయాల్లో ఉన్నతస్థాయిలో నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న కెవిపి రామచందర్ రావు మాటలను కూడా ఆయన లెక్క చేయడం లేదు. అలా లెక్క చేయకుండా జగన్ అధిష్టానంతో కయ్యానికి కాలు దువ్వారు. అలా కాలు దువ్వి వెనక్కి తిరిగి రాలేని దశకు చేరుకున్నారు.
అధిష్టానంతో సయోధ్య అంటే జగన్ కడప పార్లమెంటు నియోజకవర్గానికి పరిమితం కావాల్సిందే. ఒకప్పుడైతే నాయకత్వం అప్పగించడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పునరాలోచన చేసేవారేమో. కానీ ఇప్పుడు జగన్ ను విశ్వసింసడానికి ఆమె సిద్ధంగా లేరు. జగన్ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయ పరిణామాలను రాహుల్ గాంధీ కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఇప్పుడు జగన్ కు నాయకత్వం దక్కే అవకాశాలు దాదాపుగా కనుమరుగైనట్లే. ఒక మామూలు పార్లమెంటు సభ్యుడిగా ఉంటే కొన్ని దశాబ్దాల తర్వాత జగన్ కు ఏమైనా అవకాశం అంది వస్తుందేమో తెలియదు. అలాగ అణగి ఉండి, సుదీర్ష కాలం వేచి ఉండే స్థితిలో జగన్ లేరు. అందువల్ల జగన్ భవిష్యత్తు సందేహంలో పడినట్లే. సెప్టెంబర్ 2వ తేదీన ఆయన పార్టీ పెట్టినా ఊపు వస్తుందనే నమ్మకం లేదు.












Click it and Unblock the Notifications