ఎమ్మార్ ప్రాపర్టీస్ కు నోటీసు జారీ చేయాలని ఎపిఐఐసి నిర్ణయం

సమావేశ అనంతరం ఛైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. 26 శాతం వాటా తమకు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎమ్మార్‌కు నోటీసు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నోటీసుకు 60 రోజుల్లోగా సమాధానం ఇచ్చేందుకు ఎమ్మార్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. వివరణ తర్వాతే చర్యలు ఉంటాయని అన్నారు. ఈ వివాదం తేలేవరకూ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసినట్లు తెలిపారు. ఎమ్మార్ ఒప్పందంలో ఏపీఐఐసీకి ఎంతనష్టం జరిగిందనేది లెక్కవేస్తున్నామని చెప్పారు. తప్పులకు అప్పటి ఏపీఐఐసీ సిబ్బంది కూడా బాధ్యలే అని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే అధికారం ఏపీఐఐసీకి లేదని ఆయన చెప్పారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై ప్రతిపక్షాల నాయకులతో పాటు అధికార కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు ఎడతెరిపి లేకుండా విమర్శలు కురిపిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకుని వెళ్తానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం చెప్పారు. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు అంబటి రాంబాబు ఎపిఐఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications