టిడిపి అధినేత చంద్రబాబు మారరు, నేతలు అసలు మారరు?

పార్టీ నాయకుల్లో కాకుండా పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర అసంతృప్తి, నిరాశ చోటు చేసుకుంది. పనిచేసినా తగిన గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో చోటు చేసుకుంది. కష్టపడి పని చేసినవారికి కాకుండా చంద్రబాబుకు దగ్గరై మాటలు చెప్పే వారికే పదవులు దక్కుతున్నాయనే అభిప్రాయం అలుముకుంది. రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ తలెత్తిన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ కోసం పనిచేయనివారికి, సంపన్నులకు మాత్రమే చంద్రబాబు రాజ్యసభ టికెట్లు కేటాయించారనే విమర్శ అప్పట్లో వచ్చింది. దాంతో పార్టీ నాయకులు పెద్దగా పని చేయడానికి ఇష్టపడడం లేదు. మరో వైపు తెలంగాణ అంశం పెద్ద సమస్యగా మారింది. చంద్రబాబు వైఖరి వల్ల ప్రజల్లోకి వెళ్లలేని స్థితి నెలకొందని సీనియర్ నాయకులు ఆవేదన చెందుతున్నారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు పది జిల్లాల్లో పర్యటించారు. ఆ పర్యటనల సందర్భంగా నాయకులు చంద్రబాబు వెంట ఉంటున్నారే తప్ప తమ తమ ప్రాంతాల్లో పర్యటనలు చేయడం లేదు. దీంతో చంద్రబాబు పదే పదే నాయకుల తీరును తప్పు పడుతున్నారు. చంద్రబాబు వైఖరి కూడా చాలా సార్లు నాయకులను డైలమాలో పడేస్తోంది. మంగళవారం ప్రభుత్వం ఫ్రీజోన్ వ్యవహారంపై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ఎవరు వెళ్లాలో కూడా తెలియని స్థితి నెలకొని ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు మనోగతం ఏమిటో తెలియక తెలంగాణ నాయకులు దానిపై స్పందించలేదు. సమావేశానికి వెళ్లడానికి పార్టీ నాయకులు అందుబాటులో లేరు. ఆఖరు నిమిషంలో వెతికితే పి. చంద్రశేఖర్ ఒక్కరే అందుబాటులో ఉన్నారు. ఆఘమేఘాల మీద సమావేశానికి వెళ్లాలని ఆయనకు చెప్పారు. ఇలాంటి వాతావరణంలో నాయకులు పని చేసే స్థితి కూడా లేదనే అభిప్రాయం నెలకొని ఉంది. చంద్రబాబు స్పష్టంగా ఉంటే తప్ప పరిస్థితిలో మార్పు రాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications