బిపి, సుగర్ కావాలంటే ఆ ఉద్యోగంలో చేరాల్సిందే...

కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్న 52 శాతం మంది జీవన శైలి వ్యాధులతో బాధపడుతుంటే.. 24 శాతం మంది దీర్ఘకాల వ్యాధులతో, 18 శాతం మంది తీవ్ర ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం 6 శాతం మందే ఆరోగ్యంగా ఉన్నారు. చికిత్స కన్నా నివారణ ముఖ్యమన్న విషయాన్ని మర్చిపోవడమే దీనికి కారణం. ప్రధానంగా నివారణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లోపించడం వల్ల ఉద్యోగులు వివిధ వ్యాధులకు, ఆరోగ్య ఇబ్బందులకు లోనవుతున్నారని అసోచామ్ వెల్లడించింది. జీవన శైలి వ్యాధుల కోవకు చెందిన వూబకాయంతో అత్యధికంగా 26 శాతం మంది ఉద్యోగులు బాధపడుతున్నారని నివేదిక విడుదల సందర్భంగా అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు.
ఊబకాయం తర్వాత మానసిక కుంగుబాటు (డిప్రెషన్)తో బాధపడుతున్న వారు ఉన్నారు. మూడు, నాలుగు స్థానాల్లో రక్తపోటు (బీపీ), మధుమేహం ఉన్నాయి. అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల్లో 12 శాతం మందికి బీపీ, 10 శాతం మందికి మధుమేహం ఉంది. స్పాండోలిసిస్‌తో 8 శాతం, గుండె జబ్బులతో 6 శాతం, సెర్వికల్ వ్యాధులతో 5 శాతం, ఆయాసంతో 4 శాతం, స్లిప్ డిస్క్‌తో 3 శాతం, ఆర్థరైటిస్‌తో 2.5 శాతం మంది బాధపడుతున్నారు. అధిక పని లక్ష్యాలు, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలకు కారణమవుతున్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు.
నిద్రలేని రాత్రులు: నిద్రలేమి శరీరంపై విస్తృత ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పగలు నిద్రమత్తు, శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడి, పనితీరు మందగించడానికి కారణం అవుతోంది. తలనొప్పి, నడుం నొప్పి, జ్వరం వంటివి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆఫీసుకు రాక తప్పడం లేదు. వృత్తిపరమైన పోటీ ఇటువంటి పరిస్థితులను సృష్టిస్తోంది. 38% మందికి వ్యాయాయమే లేదు: ఉద్యోగుల్లో 38 శాతం మంది అసలు శారీరక వ్యాయామమే చేయడం లేదు. 18 శాతం మంది వారంలో ఒక గంట కూడా కేటాయించలేకపోతున్నారు. 4 శాతం మంది వారానికి గంట నుంచి 3 గంటలు వ్యాయాయం చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. 2.5 శాతం ఉద్యోగులు కొద్దిగా శ్రద్ధ చూపించి 3 నుంచి 6 గంటలు శరీరానికి పని పెడుతున్నారు. కేవలం 1.5 శాతం మంది మాత్రమే వారానికి 6 గంటల కన్నా ఎక్కువ సేపు శారీరక శ్రమ చేస్తున్నారు.
అధ్యయనం ఎలా చేశామంటే..
* వివిధ ప్రధాన నగరాల్లోని కంపెనీలకు చెందిన 800 మంది ఉద్యోగులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
* 20-70 ఏళ్ల మధ్య వయసు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.
* ఇందులో పాల్గొన్న వారిలో 52 శాతం మంది బయటకు వెళ్లి తిండి తినే ఎగ్జిక్యూటివ్‌లే.
* ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో అధ్యయనం నిర్వహించారు. సగటున ఒక్కో నగరం నుంచి 150 మందిని ఎంపిక చేశారు.
* 18 రంగాలకు చెందిన కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఎంపిక చేశారు. ఇందులో ఎక్కువ మంది ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లో పని చేస్తున్న వారే.
* జీవన శైలి వ్యాధుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.