హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరి అమాయకంగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సోమవారం అన్నారు. రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ పరిష్కారం అవుతుందన్న పురందేశ్వరి వ్యాఖ్యలు అమాయకంగా ఉన్నాయన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎస్సార్సీతో సంబంధం లేకుండా కేంద్రం తెలంగాణ ప్రకటించాలని ఆయన కోరారు.
వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మినహా మరే నిర్ణయం తీసుకున్నా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండో ఎస్సార్సీ అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు.