జగన్ ఇంటి విలువ ఇంకా అంచనా కట్టలేదు: సిబిఐ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ సాగుతోందని సిబిఐ వర్గాలు చెప్పాయి. జగన్ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని సిబిఐ వర్గాలు చెప్పాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఇనుప ఖనిజం ట్రాన్స్‌పోర్టర్ కీలకమైన సమాచారాన్ని సిబిఐకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ ఎంజిఎఫ్ చైర్మన్‌ను విచారించడానికి సిబిఐ రంగం సిద్ధం చేసుకుంటోంది. వైయస్ జగన్ ఇంటి విలువను ఇంకా అంచనా వేయలేదని, త్వరలోనే నివేదిక వస్తుందని సిబిఐ ప్రకటించింది. జగన్ కేసులో వాన్‌పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్‌ను, వాన్‌పిక్ వ్యవహారంలో జీవోలు జారీ చేసిన అధికారులను, ముగ్గురు కలెక్టర్లను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఐఎఎస్ అధికారి భానును మళ్లీ ప్రశ్నించాల్సిన అవసరం లేదని సిబిఐ వర్గాలు చెప్పాయి. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయని, మైనింగ్ వ్యాపారులు శశికుమార్, కొండా రెడ్డి నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పాయి. కాప్టివ్ మైన్స్‌ను గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారని చెప్పాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డిని, జగన్‍ను మళ్లీ ప్రశ్నించాల్సిన అవసరం లేదని అన్నాయి. గాలి పిఎ అలీఖాన్ పరారీలో ఉన్నాడని, అతను దొరికితే గాలి జనార్దన్ రెడ్డి గుట్టు రట్టవుతుందని అన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో డాక్యమెంట్ ఎక్పిప్‌మెంట్ చాలా ఉందని చెప్పాయి. బళ్లారి నుంచి ఓబుళాపురం వరకు ముడి ఇనుము రవాణా అయినట్లు తేలిందని వెల్లడించాయి.
వైయస్ జగన్, ఎమ్మార్ కేసుల్లో సిబిఐ సోదా పత్రాలు తమకు ఇప్పించాలని ఆదాయం పన్ను శాఖ దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పును కోర్టు సోమవారం ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ కేసుల్లో విచారణ పూర్తయింది. కోర్టు సోమవారం నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉండగా తిరిగి ఎల్లుండికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications